అకాల వర్షాలు : ప్రధాని తీరుపై విపక్షం ఫైర్‌ | Rain Wreak Havoc In Four States | Sakshi
Sakshi News home page

అకాల వర్షాలు : ప్రధాని తీరుపై విపక్షం ఫైర్‌

Apr 17 2019 12:40 PM | Updated on Apr 17 2019 12:40 PM

Rain Wreak Havoc In Four States - Sakshi

అకాల వర్షాలతో నాలుగు రాష్ట్రాలు అతలాకుతలం..

సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌, రాజస్ధాన్‌, గుజరాత్‌, మహారాష్ట్రలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులతో 34 మంది మరణించారు. అకాల వర్షాలు నాలుగు రాష్ట్రాలను ముంచెత్తడంతో భారీ నష్టం వాటిల్లింది. మధ్యప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షంతో 11 మంది మృత్యువాతన పడ్డారు. ఖర్గోనే జిల్లాలో ఈదురుగాలులు, భారీ వర్షాలకు వందలాది ఇళ్లు నీటమునిగాయి. జముదిర్‌ సర్వార్‌ గ్రామంలో పిడుగుపాటుతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. ఇక గుజరాత్‌లో భారీ వర్షాలు, పిడుగుపాటుకు 9 మంది మరణించారు.

మెహసనా, బనస్కంత, సబర్కంత ప్రాంతాల్లో భారీ వర్షాలతో భారీగా పంట నష్టం వాటిల్లింది. మరోవైపు మహారాష్ట్రలో భారీ వర్షాలు, పిడుగుపాటు కారణంగా ఏడుగురు వ్యక్తులు మరణించారు. నాసిక్‌, పుణేలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్థం చేసింది. రాజస్ధాన్‌లో భారీ వర్షాలకు ఏడుగురు వ్యక్తులు మరణించారు. అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటు పెద్దసంఖ్యలో మట్టిఇళ్లు దెబ్బతిన్నాయి.  


మోదీపై భగ్గుమన్న కాంగ్రెస్‌  
గుజరాత్‌లో భారీ వర్షాలతో ఆస్తి, ప్రాణ, పంట నష్టం వాటిల్లడంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రధాని సహాయ నిధి నుంచి రూ 2 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రధాని కార్యాలయం ప్రకటించింది. కాగా గుజరాత్‌ సహా నాలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తే ప్రధాని కేవలం గుజరాత్‌నే ప్రస్తావించడం పట్ల విపక్ష కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. గుజరాత్‌లో భారీ వర్షాలతో వాటిల్లిన నష్టంపై  ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం సంతోషమే..కానీ కాంగ్రెస్‌ పాలిత మధ్యప్రదేశ్‌లోనూ అకాల వర్షాలతో ప్రాణ నష్టం జరిగిందని, ఇక్కడ బీజేపీ అధికారంలో లేకపోయినా తమ రాష్ట్రంలో అకాల వర్ష బాధితులకు కూడా ప్రధాని సంతాపం తెలపాలని ఆ రాష్ట్ర సీఎం కమల్‌ నాధ్‌ ట్వీట్‌ చేశారు. మధ్యప్రదేశ్‌లో బాధితులకు ఎలాంటి సాయం చేయని ప్రదాని గుజరాత్‌ పట్ల పక్షపాతం చూపారని కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ ఆక్షేపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement