‘ఉద్యోగాలు కోరితే చుక్కలు చూపుతున్నారు’

Rahul Gandhi Accused Narendra Modi Of Distracting People From Core Issues  - Sakshi

ముంబై : నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర సర్కార్‌ వాస్తవ అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ దుయ్యబట్టారు. యువత ఉద్యోగాలు కోరుతుంటే ప్రభుత్వం చంద్రుడిని చూడాలని చెబుతోందని ఇటీవల ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌-2ను ఉటంకిస్తూ రాహుల్‌ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా కీలకాంశాల నుంచి ప్రజల దృష్టి మరల్చుతున్నారని ఆక్షేపించారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో జరిగిన భేటీలో డోక్లాం ప్రతిష్టంభన గురించి ప్రస్తావించారా అని ప్రధాని మోదీని ప్రశ్నించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్‌ ఆదివారం లాతూర్‌ జిల్లాలో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. 2017లో చైనా దళాలు భారత భూభాగంలో ప్రవేశించడాన్ని ప్రస్తావిస్తూ ఇది మేకిన్‌ ఇండియా కాదని మేకిన్‌ చైనా అని ఎద్దేవా చేశారు.

దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలను ప్రస్తావించకుండా బీజేపీ నేతలు మూన్‌మిషన్‌, ఆర్టికల్‌ 370 అంటూ దాటవేస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతులు, నిరుద్యోగులు సమస్యలతో సతమతమవుతుంటే 15 మంది సంపన్నులకు చెందిన రూ 5.5 లక్షల కోట్ల రుణాలను మోదీ ప్రభుత్వం మాఫీ చేసిందని ఆరోపించారు. నోట్ల రద్దుతో ఎవరికి లాభం చేకూరిందని రాహుల్‌ ప్రశ్నించారు. నోట్ల రద్దు ఎవరికీ మేలు చేయకుంటే తనను ఉరి తీయాలని మోదీ అన్నారని కానీ ఆ నిర్ణయం ఎవరికీ ప్రయోజనం కలిగించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. నీరవ్‌ మోదీ వంటి వారు దేశాన్ని వీడి పరారయ్యారని చెప్పుకొచ్చారు. చంద్రుడిపైకి రాకెట్‌ పంపితే మహారాష్ట్రలోని ప్రజల పొట్టలో అది తిండి నింపలేదని వ్యంగ్యంగా అన్నారు. పేదల జేబుల్లో డబ్బును కొల్లగొట్టి పెద్దలకు పంచేందుకే నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాల వెనుక ఉద్దేశమని మోదీ సర్కార్‌పై ధ్వజమెత్తారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top