లిక్కర్‌ ప్రచారంలో దొర్లిన తప్పు.. అధికారుల క్షమాపణ | Sakshi
Sakshi News home page

లిక్కర్‌ ప్రచారంలో దొర్లిన తప్పు.. అధికారుల క్షమాపణ

Published Thu, May 7 2020 10:42 AM

Punjab govt apologized for Liquor Announcement in Religious Places - Sakshi

చండీగఢ్ : దుకాణాల వద్ద వైరస్‌ వ్యాప్తిని తగ్గించేందుకు నేటి నుండి మద్యాన్ని హోం డెలివరీ చేయనున్నట్లు పంజాబ్‌ రాష్ట్ర ఎక్సైజ్‌ అండ్‌ టాక్సేషన్‌ శాఖ తెలిపిన విషయం తెలిసిందే. అయితే పంజాబ్‌లోని ముక్త్‌సర్‌ స్థానిక పరిపాలనా విభాగం అధికారులు లిక్కర్‌ హోం డెలివరీ విషయాన్ని ప్రజలకు త్వరగా చేరేలా వివిధ మార్గాల ద్వారా తెలపానుకున్నారు. దీనిలో భాగంగా గుడుల్లో వినియోగించే లౌడ్‌స్పీకర్లలో కూడా లిక్కర్‌ హోం డెలివరీ చేయనున్నట్టు ప్రకటించాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై ప్రతిపక్ష అకాళీదళ్‌ నిప్పులు చెరిగింది. అయితే ఇది అనుకోకుండా జరిగిన తప్పిదం అంటూ స్థానిక పరిపాలనా విభాగం అధికారులు క్షమాపణలు కోరారు. (‌మద్యం ఇక హోం డెలివరీ..!)  

ముక్త్‌సర్‌ జిల్లా డిప్యూటీ కమిషనర్‌ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే వెనక్కు తీసుకుని, ఈ ఘటనతో సంబంధం ఉన్న అధికారులపై విచారణకు ఆదేశించాలని అకాళీదళ్‌ అధికారప్రతినిధి దల్జిత్‌ సింగ్‌ చీమా డిమాండ్‌ చేశారు. ముక్త్‌సర్‌ సాహీబ్‌ అనేది సిక్కు చరిత్రలోనే అత్యంత గౌరనీయమైన ప్రదేశం అని తెలిపారు. పరిపాలనా విభాగం ఉత్తర్వులు చూస్తుంటే మద్యంతో ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం ఎంతలా ప్రయత్నిస్తుందో అర్థం అవుతోందన్నారు.

ముక్త్‌సర్‌ డిప్యూటీ కమిషనర్‌ అర్వింద్‌‌ కుమార్‌ ఈ ఘటనపై క్షమాపణలు తెలిపారు. గురుద్వారాల్లోని లౌడ్‌ స్పీకర్లలో లిక్కర్‌ హోం డెలివరీ విషయాన్ని ప్రకటించాలని ఉత్తర్వుల్లో తెలపడం బాధాకరమని, ఇది అనుకోకుండా జరిగిన తప్పు అని తెలిపారు. సవరించిన ఉత్తర్వులను తిరిగి విడుదల చేశామన్నారు. 

మద్యాన్ని నేటి నుంచి హోం డెలివరీ చేయనున్నట్లు పంజాబ్‌ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. లిక్కర్‌ డెలివరీ సమయాన్ని సంబంధిత శాఖ కమిషనర్లు నిర్ణయిస్తారని తెలిపింది. డెలివరీకి ఒక్కో ఇంటికి 2లీటర్ల మద్యమే అందుబాటులో ఉంటుంది. 21 వయసు దాటిన వారికి మద్యం డెలివరీ చేసేలా చర్యలు తీసుకున్నారు. దీనికోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను కూడా రూపొందించారు. మద్యం షాపుల వద్ద తాకిడిని తగ్గించేందుకే సైట్‌ ప్రారంభించింది. మరోవైపు రాష్ట్రంలో మద్యం షాపులు కూడా తెర‌వ‌నున్నారని, అయితే షాపింగ్ సముదాయాలు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు మాత్రమే తెర‌వ‌నున్నట్లు పేర్కొన్నారు.(కరోనా.. 53 వేలకు చేరువలో కేసులు)

Advertisement

తప్పక చదవండి

Advertisement