
భువనేశ్వర్ : ఒడిశాలోని రూర్కెలలో కరోనా వైరస్ పోలీసులు, స్థానికుల మధ్య చిచ్చురేపింది. రూర్కెల జిల్లాలో కరోనా ఉధృతి ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించింది. దీంతో నిబంధనలు కఠినంగా అమలు చేస్తోన్న ప్రభుత్వం ప్రజలు ఎవరూ బయటకు రాకుండా ఆంక్షలు విధించింది. వాహనాలు తిరగకుండా రోడ్లకు అన్ని వైపులా పెద్ద ఎత్తున బారికేడ్లను అమర్చింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహంతో రెచ్చిపోయారు. కంటైన్‌మెంట్ జోన్‌ను ఎత్తివేయాలంటూ వందలాది మంది ప్రజలకు రోడ్ల మీదకు వచ్చారు. ఈ క్రమంలోనే పోలీసులు రంగంలోకి దిగి వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించగా.. స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. (కరోనా : రాజకీయ సంక్షోభం తప్పదా..!)
పోలీసుల పైకి పెద్ద ఎత్తున రాళ్లు రువ్వి పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పలుపురు పోలీసులతో పాటు స్థానికులు గాయపడ్డారు. ప్రభుత్వం అదనపు బలగాలను దింపడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ప్రజలంతా లాక్‌డౌన్‌కు సహకరించాలని, సంయమనం పాటించాలని ప్రభుత్వం కోరింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకే కంటైన్‌మెంట్ జోన్లును ప్రకటించామని వివరించింది. ఇక పోలీసులపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పోలీస్ శాఖ ప్రకటించింది.