నోరూరించిన ‘దాల్‌ రైసినా’

Prime Minister Likes Dal Raisina - Sakshi

దేశ ప్రథమ పౌరుడు మెచ్చిన వంటకం ఇది. అందుకే రెండు రోజుల సమయం తీసుకున్నా సరే, వెనుకాడకుండా పాక శాస్త్ర ప్రవీణులు ప్రత్యేక శద్ధతో తయారు చేశారు. ఆ వంటకం దాల్‌ రైసినా..! ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండోసారి ప్రమాణ స్వీకారం అనంతరం రాష్ట్రపతి భవన్‌లో అతిథులకు ఇచ్చిన విందులో వడ్డించిన ఈ పప్పు తయారీకి ఏకంగా రెండు రోజులు పట్టింది. మే 28వ తేదీ రాత్రి పప్పు తయారు చేయడం మొదలు పెడితే, అతిథులకు వడ్డించేందుకు గురువారం రాత్రికి తయారైంది.  మొట్ట మొదటసారికి ఈ వంటకాన్ని 2010లో అప్పటి రాష్ట్రపతి భవన్‌ చీఫ్‌ చెఫ్‌ మచీంద్ర కసూరి వండారు. కేవలం ఆరు నుంచి ఎనిమిది గంటల్లోనే ఆ వంటకం తయారీ పూర్తయింది. కానీ, ఆయన స్థానంలో చెఫ్‌గా వచ్చిన మొంతి సైనీ మాత్రం ఈ పప్పు వండటానికి  48 గంటలు పడుతుందని గట్టిగా చెబుతున్నారు. 

అన్ని గంటలు ఎందుకంటే ..
కేవలం పప్పు ఉడకడం కోసం అన్ని గంటల సమయమైతే పట్టదు కానీ వండడానికి ముందు చేసే ప్రక్రియతో కలిపి రెండు రోజుల సమయం తీసుకుంటుంది. మోదీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని తిలకించడానికి దేశ విదేశాల నుంచి 8 వేల మంది అతిథులు వచ్చారు. అంతమందికి సరిపడే పప్పు వంటాలంటే ఆ మాత్రం సమయం పట్టదా అని సైనీ ప్రశ్నిస్తున్నారు. ఆయన రెసిపీ ప్రకారం.. మినపప్పు, రాజ్మాలను ఒక రాత్రంతా నానబెట్టి ఉంచాలి. మధ్య మధ్యలో వాటిని నాలుగైదు సార్లు కడగాలి. ఆ తర్వాత అందులో వెన్న, క్రీమ్, టొమాటో ప్యూరీ, గరమ్‌ మసాలా, కసూరి మేథి కలిపి ఆరు నుంచి ఎనిమిది గంటల సేపు తక్కువ మంటపై ఉడికించాలి. పప్పు ఉడుకుతున్నంతసేపు నిరంతరం కలుపుతూ ఉండాలి.

ఈ పప్పులో బయటకు చెప్పని ఒక పదార్థాన్ని కలుపుతారట. దీంతో రాష్ట్రపతి భవన్‌ అంతటా ఆ పప్పు ఘుమఘమలు వ్యాపించి అతిథుల నోరూరిస్తాయి. విదేశీ అతిథులెవరు రాష్ట్రపతి భవన్‌కు వచ్చినా సరే దాల్‌ రైసినా తప్పకుండా మెనూలో ఉండాలని ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉన్నప్పుడే ఆదేశాలు జారీ చేశారట. 2015 గణతంత్ర దినోత్సవాలకు వచ్చినప్పుడు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా దంపతులు భారత్‌ పర్యటన సందర్భంలో దాల్‌ రైసినాను వడ్డించారు. అప్పట్లో చెఫ్‌గా ఉన్న మచీంద్ర కసూరీ వెజిటేరియన్‌లో కొత్త కొత్త వంటకాలు నిరంతరం ప్రయత్నించేవారు. సీతాఫల్‌ హల్వా, అంజీర్‌ కోఫ్తా తయారీలోనూ కసూరీ సిద్ధహస్తులు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top