‘పద్మ’ పురస్కారాల ప్రదానం

President Kovind confers Padma awards - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: 2019 ఏడాదికిగానూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాల్‌లో ఘనంగా జరిగింది. మొత్తం 112 మందికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ పురస్కారాలు ప్రకటించగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తాజాగా 47 మందికి ప్రదానం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మిగిలిన వారికి ఈ నెల 16న అందజేస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి ‘రైతు నేస్తం’ వ్యవస్థాపక అధ్యక్షుడు యడ్లపల్లి వెంకటేశ్వరావు పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న వారిలో ఉన్నారు.ప్రముఖ నటుడు మోహన్‌లాల్, అకాలీదళ్‌ నాయకుడు సుఖ్‌దేవ్‌ సింగ్‌ దిండ్సా, బిహార్‌ నాయకుడు హుకుందేవ్‌ నారాయణ్‌ యాదవ్, ప్రముఖ జర్నలిస్టు కుల్‌దీప్‌ నయ్యర్‌ తరఫున ఆయన సతీమణి భారతి నయ్యర్‌ పద్మభూషణ్‌ పురస్కారాలు అందుకున్నారు. గాయకుడు శంకర్‌ మహదేవన్, నటుడు ప్రభుదేవా, టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారుడు శరత్‌కమల్‌ తదితరులు పద్మశ్రీ పురస్కారాలు స్వీకరించారు.

రైతాంగానికి నా పురస్కారం అంకితం
సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న తనకు లభించిన పద్మశ్రీ పురస్కారాన్ని తెలుగు రాష్ట్రాల రైతాంగానికి అంకితమిస్తున్నట్లు యడ్లపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు. అవార్డు అందుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో సేంద్రియ వ్యవసాయంపై రైతులకు మరింత అవగాహన కల్పించేందుకు జిల్లాలు, మండలాల స్థాయిలో మోడల్‌ ఫాంలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ‘రైతు నేస్తం’ కృషి చేస్తుందని, సేంద్రియ వ్యసాయంలో రైతులకు శిక్షణ ఇచ్చి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేలా వారి ఉత్పత్తులకు మార్కెటింగ్‌ వసతి కూడా కల్పిస్తుందన్నారు. యువత కూడా వ్యవసాయం వైపు రావాలని పిలుపునిచ్చారు.  


కార్యక్రమంలో పద్మ పురస్కారాల గ్రహీతలు ప్రభుదేవా, సామాజిక కార్యకర్త బంగారు అడిగలార్, శంకర్‌ మహదేవన్, శివమణి, మోహన్‌లాల్‌
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top