మంత్రి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం | Sakshi
Sakshi News home page

మంత్రి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం

Published Fri, Aug 18 2017 3:55 AM

మంత్రి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం

ఆదినారాయణ రెడ్డి దళితులకు క్షమాపణలు చెప్పాలి
అంబేడ్కర్‌ మనవడు  ప్రకాశ్‌ అంబేడ్కర్‌ డిమాండ్‌


సాక్షి, న్యూఢిల్లీ: దళితుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్‌ మంత్రి ఆది నారాయణరెడ్డి క్షమాపణ చెప్పాలని అంబేడ్కర్‌ మనవడు, భారతీయ రిపబ్లికన్‌ పక్షాల బహుజన్‌ మహాసంఘ్‌ (బీబీఎం) పార్టీ జాతీయ నేత ప్రకాశ్‌ అంబేడ్కర్‌ డిమాండ్‌ చేశారు. దళితులను ఉద్దేశించి మంత్రి చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. ఇండియన్‌ ఎకనమిక్స్‌ అసోసియేషన్‌ సభ్యుడు బోరుగడ్డ అనిల్‌కుమార్‌ గురువారం ప్రకాశ్‌ అంబేడ్కర్‌ను ఢిల్లీలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా వీరు తెలుగు రాష్ట్రాల్లో దళితుల సంక్షేమం గురించి చర్చించుకున్నారు.

గరగపర్రులో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు గ్రామ దళితులను సామూహికంగా బహిష్కరించడం, దళితులపై రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి అనిల్‌ వివరించారు. దీనిపై ప్రకాశ్‌ అంబేడ్కర్‌ స్పందిస్తూ.. ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలను, అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు దళితులను సామూహికంగా బహిష్కరించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. గరగపర్రు దళితులను తాను త్వరలోనే పరామర్శిస్తానని, సెప్టెంబర్‌ 24 తరువాత గరగపర్రులో పర్యటిస్తానని తెలిపారు. రాజ్యాంగాన్ని రచిం చిన అంబేడ్కర్‌ ఒక దళితుడని, భారత రాష్ట్రపతి ఒక దళితుడని గుర్తు చేస్తూ.. మంత్రి వ్యాఖ్యల ఉద్దేశమేంటని ప్రశ్నించారు.

దళితులు నిద్రపోతున్న సింహాలు
దళితులు నిద్రపోతున్న సింహాలని, వారిని రెచ్చగొడితే ప్రభుత్వాలే కూలిపోతాయని అనిల్‌ అన్నారు. దళితుల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మంత్రిని హెచ్చరించారు. దళితులపై చేసిన వాఖ్యలను ఉపసంహరించుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.  లండన్‌లో విద్యనభ్యసించిన అనిల్‌ ఇండియన్‌ ఎకనమిక్స్‌ అసోసియేషన్‌ సభ్యుడిగా ఇటీవలే ఎన్నికయ్యారు. ఈ అసోసియేషన్‌లో మాజీ, ప్రస్తుత రాష్ట్రపతులు, ప్రధాన మంత్రులు, కేంద్ర ఆర్థిక మంత్రులు సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. దళితులు, మైనారిటీల సంక్షేమం కోసం అనిల్‌ వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టారు.

Advertisement
Advertisement