
పశువుల అక్రమ రవాణా ఆరోపణలు
ఒడిశాలోని గంజాంలో దళితులపై అమానుషం
బరంపురం: పశువులను దొంగతనంగా రవాణా చేస్తున్నారనే అనుమానంతో ఇద్దరు దళితులను తీవ్రంగా కొట్టి, సగం గుండు గీయించి, మోకాళ్లపై నడిపించడంతోపాటు గడ్డి తినిపించారు. ఈ దారుణం ఒడిశాలోని గంజాం జిల్లా ధారకొటే పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఖారిగుమ్మ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడంతో రాజకీయ పార్టీలు సామాజిక సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.
సింగిపూర్‌కు చెందిన బాబులా నాయక్(54), బులు నాయక్(42)లు హరియూర్ గ్రామం నుంచి ఒక ఆటోలో రెండు ఆవులు, ఆవుదూడను తీసుకువస్తున్నారు. వీరిని ఖారిగుమ్మ గ్రామానికి చెందిన ‘గో పరిరక్షకులు’కొందరు అడ్డుకున్నారు. వాటిని తన కుమార్తెకు బహుమతిగా ఇచ్చేందుకు తీసుకెళ్తున్నానని బాబులా చెప్పగా కొట్టిపారేశారు. దొంగతనం చేశారంటూ వారిపై నెపం వేశారు.
రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా బాధితులు తిరస్కరించారు. దీంతో, వారిని తీవ్రంగా కొడుతూ నానా దుర్భాషలాడారు. సెలూన్‌కు తీసుకెళ్లి సగం జుత్తు గొరిగించారు. కిలోమీటర్ల దూరం వారిని మోకాళ్ల మీద నడిపించారు. మురుగు కాల్వలో నీటిని తాపించారు. గడ్డి తినిపించారు. కేసు నమోదు చేసి, ఆరుగురిని అరెస్ట్ చేశామని, పరారీలో ఉన్న మరో ఆరుగురి కోసం గాలిస్తున్నామని ఎస్‌పీ సువేందు కుమార్ పాత్ర తెలిపారు. వారు గో పరిరక్షకులు కాదు, బలవంతంగా డబ్బులు వసూలు చేసేవారు మాత్రమేనని ఆయన అన్నారు.