గ్యాస్‌ లీకేజీ ఘటనపై ప్రధాని మోదీ ఆరా

PM Narendra Modi Responds On Visakhapatnam Gas Leakage - Sakshi

గ్యాస్‌ లీకేజీ ఘటనపై ప్రధాని మోదీ, అమిత్‌ షా విచారం

సహాయ చర్యలకు ఆదేశం

సాక్షి, న్యూఢిల్లీ : ఎల్‌జీ పాలిమర్స్‌లో రసాయన వాయువు లీకేజీ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు ఉంటాయని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా దుర్ఘటన వివరాలను సీఎం జగన్‌ ప్రధానమంత్రికి వివరించారు. తీసుకున్న సహాయ చర్యలను కూడా ఆయనకు తెలియజేశారు. పరిస్థితి అదుపులోనే ఉందని, బాధితులకు వైద్య సహాయం అందిస్తున్నామని వెల్లడించారు. తాజా ప్రమాదంపై చర్చించేందుకు జాతీయ విపత్తు నివారణ అధికారులతో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. సహాయ చర్యలు, బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాలపై సమీక్షిస్తున్నారు. (విశాఖకు రానున్న సీఎం వైఎస్‌ జగన్‌) 

మరోవైపు గ్యాస్‌ లీకేజీ ఘటనపై ప్రధాని మోదీ ట్విటర్‌ వేదికగా విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై కేంద్ర హోమంత్రిత్వ శాఖ, జాతీయ విపత్తు నివారణశాఖా అధికారులతో మాట్లాడానని మోదీ తెలిపారు. బాధితులను ఆదుకునేలా వెంటనే సహాయ చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించినట్లు ప్రధాని పేర్కొన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పడు సమీక్షిస్తున్నామన్నారు. గ్యాస్‌ లీకేజీ ఘటనలో అస్వస్థకు గురైన వారు వెంటనే కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు మోదీ ట్వీట్‌ చేశారు. 

అమిత్‌ షా దిగ్ర్భాంతి
కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సైతం గ్యాస్‌ లీకేజీ ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. జాతీయ విపత్తు నివారణ అధికారుతో మాట్లాడినట్లు తెలిపారు. ఘటనపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నామన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితులు వెంటనే కోలుకోవాలని అమిత్‌ షా ఆకాంక్షించారు. కాగా విశాపట్నం జిల్లా జిల్లా పరిధిలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఎల్‌జి పాలిమర్స్‌లో గురువారం తెల్లవారుజామున రసాయన వాయువు లీకేజీ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందగా, 200 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటికే మంత్రులు, అధికారులు సహాయ చర్యలను ముమ్మరం చేయగా.. మరికాసేట్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఘటనాస్థలికి చేరకోనున్నారు. సహాయ చర్యలను పరిశీలించి బాధితులను పరామర్శించనున్నారు. (ఎల్‌జీ పాలిమర్స్‌ పుట్టుక గురించి..)

దురదృష్టకర ఘటన  : వెంకయ్య నాయుడు
తాజా ఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు. ఘటన జరగటం చాలా దురదృష్టకమన్నారు. ‘విశాఖపట్టణం శివార్లలోని ఓ ప్రైవేటు కంపెనీ పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకైన దురదృష్టకర ఘటనలో జరిగిన ప్రాణనష్టం నన్నెంతగానో కలిచివేసింది. ఈ దారుణ ఘటనలో మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. బాధితులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ ఘటనపై పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడాను. ఈ విషయంలో అవసరమైన సహాయం అందిస్తున్నట్లు వారు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, స్థానిక అధికారుల ఆధ్వర్యంలో సహాయక కార్యక్రమాలు చేపట్టామని హోంశాఖ కార్యదర్శి చెప్పారు.’ అని ట్వీట్‌ చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top