
'పర్సనల్ లా' బోర్డులు.. సమగ్రతకు అవరోధాలు
రాజ్యాంగంపై చర్చ సందర్భంగా మతం ఆధారంగా ఏర్పాటయిన లా బోర్డులపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: రాజ్యాంగంపై చర్చ సందర్భంగా మతం ఆధారంగా ఏర్పాటయిన లా బోర్డులపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు, ఇతర మతాలకు చెందిన ఉన్నత సంస్థలతో దేశ సమగ్రతకు భంగం కలుగుతుందని, గడిచిన 65 ఏళ్ల కాలంలో అది చాలాసార్లు రుజువైందని జైట్లీ అన్నారు.
శుక్రవారం రాజ్యసభలో చర్చను ప్రారంభించిన ఆయన మత రాజ్యస్థాపన భావనను రాజ్యాంగం నిద్వంద్వంగా తిరస్కరిస్తుందని, మతం ఆధారిత విభజనను రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సైతం తిరస్కరించారని గుర్తు చేశారు. ఒక్కో మతం ప్రత్యేకంగా రూపొందించుకున్న చట్టాల వల్ల రాజ్యాంగం అమలుకు ఆటంకాలు ఎదురవుతాయని ఊహించినందునే అంబేద్కర్.. ఆర్టికల్ 13ను శాసనంలో పొందుపర్చారని, దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి అమలు చేయాల్సిన అవసరముందని జైట్లీ పేర్కొన్నారు. ఉన్నతమైన రాజ్యాంగవ్యవస్థకు కాంగ్రెస్ పార్టీ తూట్లు పొడిచిందని, ఎమర్జెన్సీ విధించి పౌరుల హక్కులను హరించిందని మండిపడ్డారు.