68.09 శాతం ఓటింగ్ | Peaceful Polling, Moderate Turnout Mark By-elections | Sakshi
Sakshi News home page

68.09 శాతం ఓటింగ్

Sep 20 2014 12:59 AM | Updated on Aug 14 2018 2:50 PM

68.09 శాతం ఓటింగ్ - Sakshi

68.09 శాతం ఓటింగ్

రాష్ర్టంలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల పదవుల భర్తీ నిమిత్తం ఉప ఎన్నికలకు రాష్ట్ర అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది.

- కోవైలో 44, తూత్తుకుడిలో 53 శాతం
- కోవైలో 175 మందిపై కేసులు
- ఈసీ సహకారంతోనే అరాచకాలు: తమిళిసై
 
రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో 68.09 శాతం ఓటింగ్ నమోదైంది. కోయంబత్తూరు కార్పొరేషన్‌లో 44.59 శాతం, తూత్తుకుడి కార్పొరేషన్‌లో 53.83 శాతం ఓట్లు పోలయ్యాయి. గతంలో కంటే ఈసారి ఓటింగ్ తగ్గడంతో మేయర్ అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.     
సాక్షి, చెన్నై : రాష్ర్టంలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల పదవుల భర్తీ నిమిత్తం ఉప ఎన్నికలకు రాష్ట్ర అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. ఇందులో తిరునల్వేలి కార్పొరేషన్ మేయర్, మరో నాలుగు మునిసిపాలిటీ చైర్మన్ల పదవులతో పాటు వందలాది పదువులు ఏకగ్రీవమయ్యాయి. తూత్తుకుడి, కోయంబత్తూరు కార్పొరేషన్ల మేయర్ పదవులతో పాటు అరక్కోణం, రామనాథపురం, విరుదాచలం, కడలూరు మునిసిపాలిటీ చైర్మన్ల పదవులకు ఎన్నికలు అనివార్యమయ్యాయి. అలాగే, పట్టణ, జిల్లా, యూనియన్ పంచాయతీల్లో ఖాళీగా ఉన్న పదవుల భర్తీకి చర్యలు తీసుకున్నారు.

మొత్తంగా 530 పదవుల భర్తీకిగాను గురువారం ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు తొలుత మందకొడిగా సాగినా, సాయంత్రానికి వేగం పుంజుకుంది. భారీగానే ఓట్లు నమోదవుతాయని అభ్యర్థులు భావించారు. అయితే, అభ్యర్థుల్లో ఉత్కంఠ రేపే విధంగా ఓటింగ్ శాతం తగ్గిపోయింది. నగరాల్లోని ఓటర్లు పెద్దగా ఆసక్తి కనబరచనప్పటికీ, గ్రామాల్లో ఓటింగ్ నమోదు ఆశాజనకంగానే సాగింది.
 
ఓటింగ్ ప్రశాతం
రాష్ర్టంలో ఖాళీగా ఉన్న పదవులకు జరిగిన ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ శాతం వివరాల్ని రాష్ట్ర ఎన్నికల అధికారి చోఅయ్యర్ శుక్రవారం ప్రకటించారు. రాష్ర్ట వ్యాప్తంగా 68.09 శాతం ఓటింగ్ నమోదైంది. తూత్తుకుడి కార్పొరేషన్‌లో 53.83 శాతం, కోయంబత్తూరులో 44.59 శాతం ఓట్లు పోలయ్యాయి. అరక్కోణంలో 45 శాతం, రామనాథపురంలో 53.33 శాతం, విరుదాచలంలో అత్యధికంగా 67.43 శాతం, కడలూరులో 53. 66 శాతం ఓట్లు పోలైనట్టు ప్రకటించారు. పట్టణ , జిల్లా, యూనియన్ పంచాయతీ పదవులకు జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ 74 శాతంగా ఉంది. కాగా, కోయంబత్తూరులో గతంలో కంటే ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. అన్నాడీఎంకే వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నా, ఎ క్కడ ప్రతిపక్షాలన్నీ ఏకమైన బీజేపీకి మద్దతు ఇచ్చాయేమోనన్న ఉత్కంఠ నెలకొని ఉంది.

కేసుల మోత
ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన వివాదాల్లో బీజేపీ, అన్నాడీఎంకే వర్గాలపై ఎన్నికల యంత్రాంగం కేసుల మోత  మోగించింది. నగదు బట్వాడా, ఓటర్లకు బెదిరింపు, అభ్యర్థులకు హెచ్చరికలు, తమవాళ్లపై దాడులకు సంబంధించి బీజేపీ ఇచ్చిన ఫిర్యాదుతో అన్నాడీఎంకే వర్గాలపై వందకు పైగా కేసులు నమోదయ్యాయి. అలాగే, అన్నాడీఎంకే  ఇచ్చిన ఫిర్యాదుతో బీజేపీ నాయకులపై సైతం కేసులు నమోదు చేశారు. కోయంబత్తూరులో అత్యధికంగా 175 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇందులో అన్నాడీఎంకే ఎమ్మెల్యే చిన్నస్వామి కూడా ఉన్నారు.
 
ఫలితం స్ట్రాంగ్‌రూమ్‌లోకి!
ఎన్నికల పర్వం ముగియడంతో గట్టి భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్‌ల్లో బ్యాలెట్ బాక్సుల్ని ఉంచారు. కోయంబత్తూరు, తూత్తుకుడి కార్పొరేషన్లతో పాటు నాలుగు మునిసిపాలిటీల పరిధుల్లోని వార్డుల్లో నమోదైన ఓటింగ్ బ్యాలెట్ బాక్సుల్ని రాత్రికి రాత్రే ఆయా ప్రాంతాల్లో ఎంపిక చేసిన కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూమ్‌లకు చేర్చారు. వీటన్నింటినీ పరిశీలించినానంతరం ఆ గదులకు సీల్ వేశారు. ఆయా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు వేగవంతం చేశారు. ఈ నెల 22న కౌంటింగ్ జరగనుంది. కాగా, స్ట్రాంగ్ రూమ్‌ల పరిసరాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆయుధ బలగాల్ని రంగంలోకి దించారు.
 
ఈసీ సహకారంతో అరాచకాలు

ఎన్నికల యంత్రాంగం సహకారంతో ఉప ఎన్నికల్లో అధికార పక్షం అరాచకాలకు పాల్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ శివాలెత్తారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ తమకు గెలుపు అవకాశాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఓటమి భయంతో అధికార పక్షం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేకచోట్ల ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులే అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరించడం బట్టిచూస్తే, ఏమేరకు న్యాయ బద్ధంగా, శాంతియుతంగా ఈ ఎన్నికలు జరిగాయో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. ఓటమి భయంతో తమ వాళ్ల మీద అధికార పక్షం దాడులు చేసిందని, చివరకు తమ వాళ్ల మీదే కేసుల్ని నమోదు చేయించడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement