తొలి లోక్‌పాల్‌గా పీసీ ఘోష్!

PC Ghose Likely To Become India First Lokpal - Sakshi

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌(పీసీ ఘోష్‌) తొలి లోక్‌పాల్‌గా నియమితులు కానున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, లోక్‌ సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గిలతో కూడిన సెలక్షన్‌ కమిటీ జస్టిస్‌ ఘోష్‌ను ఎంపిక చేసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే రేపు(సోమవారం) వెలువడే అవకాశముంది. జస్టిస్‌ పీసీ ఘోష్‌ నాలుగేళ్ల పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 2017లో ఆయన పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం ఆయన జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ)లో సభ్యుడిగా కొనసాగుతున్నారు.

లోక్‌పాల్‌ ఎంపిక సమావేశానికి లోక్‌సభలో కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు మల్లికార్జున్‌ఖర్గే హాజరుకాలేదు. లోక్‌పాల్‌లోని 8 మంది సభ్యులు, ఇతర అంశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను వచ్చేవారం విడుదల కానుంది. లోక్‌పాల్‌ను ఎంపిక చేసేందుకు సుప్రీంకోర్టు గడువు విధించడంతో కేంద్ర ప్రభుత్వం ఈమేరకు స్పందించింది. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే లోక్‌పాల్‌ను నియమిస్తానని గత ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీ హామీయిచ్చారు. ఐదేళ్లు పూర్తవుతున్నా హామీని నిలుపుకోకపోవడంతో.. లోక్‌పాల్‌ బిల్లు, లోకాయుక్త చట్టం నియామకాల్లో కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ జనవరిలో సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి నిరాహారదీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top