కొరోనిల్‌ను లాంఛ్‌ చేసిన బాబా రాందేవ్‌

Patanjali Launches Ayurvedic Drug Coronil - Sakshi

‘నూరు శాతం రికవరీ’

హరిద్వార్‌ : ఆయుర్వేదిక్‌ ఉత్పత్తుల దిగ్గజం పతంజలి రూపొందించిన కరోనా ఔషధం కొరోనిల్‌ను యోగా గురు రాందేవ్‌ బాబా మంగళవారం హరిద్వార్‌లో విడుదల చేశారు. కరోనావైరస్‌కు వ్యాక్సిన్‌ కోసం యావత్‌ ప్రపంచం ఎదురుచూస్తోందని, కరోనా చికిత్సకు ఈరోజు తాము తొలి ఆయుర్వేద ఔషధం కొరోనిల్‌ను అభివృద్ధి చేశామని రాందేవ్‌ బాబా పేర్కొన్నారు. దాదాపు 100 మంది రోగులపై తాము క్లినికల్‌ పరీక్షలు నిర్వహించగా 65 శాతం మందికి మూడురోజుల్లో నెగెటివ్‌ ఫలితాలు వచ్చాయని చెప్పారు.ఏడు రోజుల్లో వంద శాతం మంది రోగులు కోలుకున్నారని వెల్లడించారు. తమ ఔషధం నూరు శాతం రికవరీ రేటు, సున్నా శాతం మరణాల రేటును కలిగిఉందని చెప్పుకొచ్చారు.

కోవిడ్‌-19 రోగుల చికిత్సలో ఉపయోగించే ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసే క్రమంలో పతంజలి అన్ని శాస్త్రీయ నిబంధనలను పాటించిందని చెప్పారు. పతంజలి పరిశోధనా కేంద్రం, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) సహకారంతో పరిశోధన చేపట్టామని పతంజలి పేర్కొంది. కోవిడ్‌-19 చికిత్స కోసం పలు వ్యాక్సిన్‌ల అభివృద్ధి వివిధ దశల్లో ఉన్న సమయంలో ఆయుర్వేద ఔషధం అందుబాటులోకి వచ్చింది. పలు వ్యాక్సిన్లు మానవ పరీక్షలపై కీలక దశకు చేరుకున్నాయి. ఆస్ర్టాజెనెకా, మొడెర్నా, ఫిజర్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, మెర్క్‌, సనోఫి, బయోఎన్‌టెక్‌, కాన్సినో బయోలాజిక్స్‌ వంటి పలు సంస్ధలు వ్యాక్సిన్‌ అభివృద్ధిలో నిమగ్నమయ్యాయి.  

చదవండి : యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top