ప్రతి కన్నీటి బొట్టుకు ప్రతీకారం

Pakistan has become a synonym for terrorism - Sakshi

ఆ దేశం ఉగ్రవాదానికి మరో పేరు

ఉగ్ర మద్దతుదారుల్ని ‘నవ భారతం’ ఉపేక్షించదు

మహారాష్ట్రలో మోదీ ఉద్ఘాటన

యావత్మల్‌/ధూలె(మహారాష్ట్ర): పాకిస్తాన్‌ ఉగ్రవాదానికి పర్యాయపదంగా మారిందని ప్రధాని మోదీ తీవ్రంగా మండిపడ్డారు. భద్రతా బలగాలపై నమ్మకం ఉంచి ఓపికగా ఎదురుచూడాలని, ముష్కరులపై ప్రతీకారం తీర్చుకోవడానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని పునరుద్ఘాటించారు. మహారాష్ట్రలోని యావత్మల్, ధూలెలో ప్రధాని శనివారం పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి బహిరంగ సభల్లో మాట్లాడారు. కశ్మీర్‌లో ఉగ్రదాడి పట్ల దేశమంతా ఆగ్రహంతో ఉన్న సంగతి స్పష్టంగా తెలుస్తోందని, అందరి కళ్లు చెమర్చాయని అన్నారు. ప్రతి కన్నీటి బొట్టుకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని హామీ ఇచ్చారు. మన సైనికులు లక్ష్యంగా బాంబులు, మారణాయుధాలు సమకూర్చే ఎవరినీ ‘నవ భారతం’ ఉపేక్షించదని అన్నారు.

వాళ్ల త్యాగం వృథాగా పోదు..
‘దేశ విభజన తరువాత ఉనికిలోకి వచ్చిన దేశం ఉగ్ర కార్యకలాపాలను ప్రోత్సహిస్తోంది. దివాలా అంచుకు చేరిన ఆ దేశం ఉగ్రవాదానికి పర్యాయపదంగా మారింది’ అని యావత్మల్‌లో జరిగిన బహిరంగ సభలో పాక్‌ పేరును ప్రస్తావించకుండా మండిపడ్డారు. పుల్వామా దాడి తరువాత దేశం తీవ్ర నొప్పిని అనుభవిస్తోందని, అమర జవాన్ల త్యాగాలను వృథా కానీయమని చెప్పారు. నాగ్‌పూర్‌లోని అజ్నీ–పుణే రైలు సేవలను ప్రారంభించి, స్వయం సహాయక బృందాలకు చెక్కులు అందించారు.

విషాదంలోనే సంయమనమూ ఉండాలి..
ఉత్తర మహారాష్ట్రలోని ధూలెలో జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ.. విషాదం నిండిన ఈ సమయంలోనే సంయమనంతో వ్యవహరించాలని ప్రజలకు సూచించారు. ‘మనది కొత్త విధానాలు, పద్ధతులతో కూడిన నవ భారతం. ఈ సంగతి ప్రపంచానికి కూడా తెలుస్తుంది’ అని అన్నారు.

‘పుల్వామా’తో మోదీ ప్రచారం: కాంగ్రెస్‌
పుల్వామా దాడి కేంద్రంగా జాతీయవాదాన్ని రెచ్చగొడుతూ మోదీ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని మహారాష్ట్ర కాంగ్రెస్‌ ఆరోపించింది. ‘రాజకీయ పార్టీలన్నీ విభేదాలు విడనాడి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చిన మోదీ..తాను మాత్రం సొంత పార్టీకి ప్రచారం చేస్తూ జాతీయభావాలు రెచ్చగొడుతున్నారు. అమర జవాన్ల మృతదేహాలు ఇంకా వారి స్వస్థలాలకు చేరుకోకముందే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు’ పేర్కొంది.

మమ్మల్ని బెదిరించలేరు: పాక్‌
ఇస్లామాబాద్‌: ఉగ్రదాడి ఘటనపై తమను ఎవరూ బెదిరించలేరని పాక్‌ విదేశాంగ మంత్రి ఖురేషీ తెలిపారు. ఈ ఘటనలో భారత్‌ ఆధారాలు సమర్పిస్తే సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. జర్మనీలో జరుగుతున్న మ్యూనిక్‌ భద్రతా సదస్సులో పాల్గొంటున్న ఖురేషీ మాట్లాడుతూ..‘ఉగ్రదాడి జరగ్గానే ఏమాత్రం విచారణ జరపకుండా పాక్‌ను భారత్‌ నిందిస్తోంది. సాక్ష్యాలులేని ఆరోపణలను ప్రపంచం అంగీకరించదు. మమ్మల్ని ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు. పాకిస్తాన్‌ శాంతిని మాత్రమే కోరుకుంటోంది. ఘర్షణను కాదు. ప్రపంచదేశాల ముందు మా వాదనల్ని కూడా వినిపిస్తాం’ అని పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top