సరిహద్దుల్లో పాక్‌ పాశవికం | Pakistan Border Action Team suspected of beheading Indian porter | Sakshi
Sakshi News home page

సరిహద్దుల్లో పాక్‌ పాశవికం

Jan 13 2020 4:30 AM | Updated on Jan 13 2020 4:30 AM

Pakistan Border Action Team suspected of beheading Indian porter - Sakshi

జమ్మూ: దాయాది దేశం పాకిస్తాన్‌ మరోసారి తన నిజ స్వరూపాన్ని చాటుకుంది. పాక్‌ సైన్యానికి చెందిన బోర్డర్‌ యాక్షన్‌ టీం(బీఏటీ) పాశవిక చర్యకు పాల్పడింది. భారత సైన్యానికి సామగ్రిని సరఫరా చేసే ఇద్దరు పోర్టర్లను చంపి ఒకరి తలను నరికి తమ వెంట తీసుకెళ్లింది. గతంలో భారత జవాన్ల తలు నరికిన ఘటనలు ఉన్నప్పటికీ, ఇలా పౌరుని తలను మాయం చేయడం ఇదే మొదటిసారని సైన్యం పేర్కొంది. నియంత్రణ రేఖ వెంబడి విధులు నిర్వహించే సైనికులకు నిత్యావసరాలను అందించే పోర్టర్లే లక్ష్యంగా పాక్‌ సైన్యం శుక్రవారం విచక్షణారహితంగా మోర్టార్లు ప్రయోగించింది.

దీంతో గుల్పూర్‌ సెక్టార్‌లోని కస్సాలియాన్‌ గ్రామానికి చెందిన పోర్టర్లు మొహమ్మద్‌ అస్లాం, అల్తాఫ్‌ హుస్సేన్‌(23) చనిపోగా మరో ముగ్గురు గాయపడ్డారు. మృతుల్లో అస్లాం(28) శరీరాన్ని ఛిద్రం చేసిన బీఏటీ అతని తలను వెంట తీసుకెళ్లిందని సైనిక ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇద్దరి మృతదేహాలను కుటుంబసభ్యులకు అందజేశామని, వారి అంత్యక్రియలు శుక్రవారం పూర్తయ్యాయని పోలీస్‌ అధికారి ఒకరు వెల్లడించారు. గాయపడిన పోర్టర్లు సలీం, షౌకత్, అహ్మద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. సైనికుడనే వాడెవడూ ఇలాంటి హేయమైన చర్యలకు దిగడనీ, వీటికి సరైన సమయంలో సైనికరీతిలో స్పందిస్తామని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవాణే పేర్కొన్నారు. సామాన్యులను పాక్‌ సైన్యం పొట్టనబెట్టుకోవడాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండించింది. కాగా, సరిహద్దుల వెంట చొరబాటు, ఉగ్ర చర్యలకు పాల్పడటమే లక్ష్యంగా ఏర్పాటైన బీఏటీలో పాక్‌ సైనికులతోపాటు ఉగ్రవాదులు కూడా సభ్యులుగా ఉంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement