అత్యవసర ఔషదాల దిగుమతికి అంగీకారం!

Pakistan Allows Trade of Life Saving Medicines with India - Sakshi

ఇస్లామాబాద్‌ : జమ్ము కశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ రద్దు నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం భారత్‌తో ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలను అన్నిస్థాయిల్లో నిలిపివేసిన సంగతి తెలిసిందే. తన దేశంలో వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహానికనుగుణంగా ఇస్లామాబాద్‌లోని భారత దౌత్యాధికారిని కూడా బహిష్కరించింది. బాలీవుడ్‌ సినిమాలను, సీరియళ్లను నిలిపివేసింది. అంతేకాక, భారత్‌లో తయారైన వస్తువులను కొనుగోలు చేయరాదంటూ ఆ దేశ సోషల్‌ మీడియాలో ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆవేశంతో భారత్‌తో సంబంధాలు నిలిపివేసిన దాయాది దేశానికి ఇప్పుడు మెల్లిగా కష్టాలు తెలిసొస్తున్నాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను చూస్తే పాక్‌ నుంచి భారత్‌కు వచ్చే దిగుమతుల కన్నా భారత్‌ నుంచి పాక్‌కు అయ్యే దిగుమతులే ఎక్కువ.

ఇప్పుడు పాకిస్తాన్‌కు ప్రాణాంతక వ్యాధుల (ఉదా: రేబిస్‌, పాముకాటు)కు తగిన మందులు అవసరమయ్యాయి. ఈ మందులను ఇంతకు ముందు భారత్‌ నుంచి దిగుమతి చేసుకునేది. వాణిజ్యంపై నిషేధం దరిమిలా ఇన్ని రోజులుగా ఆ దేశంలో నిల్వ ఉన్న మందులు అయిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మందులు అందకపోతే చాలా మంది ప్రాణాలు కోల్పోయే అవకాశముంది. ఈ ప్రమాదాన్ని గ్రహించిన పాకిస్తాన్‌ వాణిజ్య శాఖ భారత్‌ నుంచి ఔషధాలను దిగుమతి చేసుకోవడానికి చట్టబద్ధంగా అనుమతినిచ్చిందని అక్కడి జియో న్యూస్‌ తెలిపింది. పిటిఐ నివేదిక ప్రకారం 2019 జులై వరకు పాకిస్తాన్‌ నుంచి భారత్‌కు 136 కోట్ల రూపాయల ఫార్మా ఆర్డర్‌ ఉంది. కశ్మీర్‌ విభజన నేపథ్యంలో ద్వైపాక్షిక వాణిజ్యం రద్దు కావడంతో ఇవి ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇప్పుడు పౌరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లిన ఇటువంటి పరిస్థితిలో పాక్‌కు భారత్‌ను ఆశ్రయించాల్సిన పరిస్థితులు అనివార్యమయ్యాయి. మరి ఈ విషయంపై మోదీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో.. వేచి చూడాలి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top