కేంద్ర మంత్రికి ఎంపీ ‘భాష’ కౌంటర్‌ | Odisha MP Not Understand Minsiter's Hindi Letter | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రికి ఎంపీ ‘భాష’ కౌంటర్‌

Aug 20 2017 3:57 PM | Updated on Sep 17 2017 5:45 PM

కేంద్ర మంత్రికి ఎంపీ ‘భాష’ కౌంటర్‌

కేంద్ర మంత్రికి ఎంపీ ‘భాష’ కౌంటర్‌

కేంద్ర మంత్రి ఓ ఎంపీకి హిందీలో రాసిన లేఖ అర్థం కాకపోవటంతో అసంతృప్తి వెల్లగక్కాడు.

న్యూఢిల్లీ: జాతీయ భాష హిందీని బలవంతంగా తమపై రుద్దటం సమంజం కాదని పలు రాష్ట్రాలు నిరసనలు వ్యక్తం చేస్తుండటం కేంద్రం వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ కేంద్ర మంత్రి- ఒడిషా ఎంపీకి ట్విట్టర్‌​ లో జరిగిన సంభాషణ ఆసక్తికరంగా మారింది.

ఇండియా 2022 విజన్‌ లో భాగంగా ఓ సమావేశానికి హాజరుకావాలంటూ కేంద్ర మంత్రి నరేంద్ర సింగ​ తోమర్‌, బీజేడీ లోక్‌సభ ఎంపీ టతాగట సత్పతికి ట్విట్టర్‌ ద్వారా ఆగష్టు 11న ఓ ఆహ్వానం పంపారు. అయితే ఆ లేఖ హిందీలో ఉండటంపై సత్పతి తీవ్ర అసంతృప్తి వెల్లగక్కారు. ఆ మరుసటి రోజే తన ట్విట్టర్‌ నుంచి ఒడియా భాషలో ఓ లేఖను పోస్ట్‌ చేశారు. ‘‘తోమర్‌ జీ నాకు హిందీ రాదు. మీరు లేఖలో ఏం రాశారో నాకు అర్థం కాలేదు’’ అంటూ కౌంటర్‌ బదులు ఇచ్చారు. అసలు హిందీతేరులను హిందీ మాట్లాడాలంటూ ఎందుకు బలవంతం చేస్తున్నారు? ఇది ఇతర భాషలపై దాడి కాదా? అంటూ సత్పతి ఆ లేఖలో తోమర్‌ని ప్రశ్నించారు. ఒడిషా సీ కేటగిరీ రాష్ట్రం కిందకు వస్తుందని, దయచేసి లేఖను స్థానిక భాష(ఒడియా) లేదా ఆంగ్లంలో పంపాలంటూ కేంద్ర మంత్రిని కోరారు.

అధికార భాష చట్టాల ప్రకారం కేటగిరీ సీ ఉన్న రాష్ట్రాల కార్యాలయాలకు లేదా అధికారికి కేంద్రం ఎలాంటి సమాచారం అయినా సరే కేవలం ఆంగ్లంలోనే పంపాల్సి ఉంటుంది. హిందీ భాషను తప్పనిసరి చేస్తూ చట్టం చేయాలని ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ప్రయత్నించటం, వ్యతిరేక ఉద్యమాల నేపథ్యంలో వెనక్కి తగ్గటం జరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో 1965 లో జరిగిన అల్లర్లలో 70 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తమిళనాడు నుంచే ఎక్కువ వ్యతిరేకత వినిపిస్తూ వస్తోంది. కొన్నాళ్ల క్రితం మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేయగా, అది ముమ్మాటికీ హిందీయేతరుల హక్కుల ఉల్లంఘనే అవుతుందని తమిళనాడు ప్రతిపక్షం డీఎంకే నిరసన వ్యక్తం చేయటంతో కేంద్రం వెనకంజ వేసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement