ఎంపీ పదవికి 10 మంది రాజీనామా | BJP MPs-Turned-MLAs Quit Parliament As CM Race Heats Up In Three States - Sakshi
Sakshi News home page

ఎంపీ పదవికి 10 మంది రాజీనామా

Published Thu, Dec 7 2023 5:53 AM

BJP MPs-turned-MLAs quit Parliament  - Sakshi

న్యూఢిల్లీ:  కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్, ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌తోపాటు పలువురు బీజేపీ ఎంపీలు తమ పార్లమెంట్‌ సభ్యత్వానికి బుధవారం రాజీనామా సమరి్పంచారు. ఇటీవల జరిగిన రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వీరు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. ఇకపై ఎమ్మెల్యేలుగానే కొనసాగాలని నిర్ణయించుకున్నారు.

మొత్తం 12 మంది బీజేపీ ఎంపీలు పార్లమెంట్‌ సభ్యత్వం వదులుకుంటున్నారు. వీరికి సొంత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి లేదా మంత్రి పదవులు దక్కుతాయని ప్రచారం సాగుతోంది. బుధవారం 10 మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన రాకేశ్‌ సింగ్, ఉదయప్రతాప్‌ సింగ్, రితీ పాఠక్, రాజస్తాన్‌కు చెందిన కిరోడీలాల్‌ మీనా, దియా కుమారి, రాజవర్దన్‌ సింగ్‌ రాథోడ్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గోమతిసాయి, అరుణ్‌ సావో రాజీనామా సమరి్పంచారు.

వీరిలో కిరోడీలాల్‌ మీనా ఒక్కరే రాజ్యసభ సభ్యుడు. మిగిలినవారంతా లోక్‌సభ సభ్యులు. మరో కేంద్ర మంత్రి రేణుకా సింగ్‌తోపాటు ఎంపీ మహంత్‌ బాలక్‌నాథ్‌ యోగి అతి త్వరలో రాజీనామా చేస్తారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. నరేంద్రసింగ్‌ తోమర్, ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్, రేణుకా సింగ్‌ కేంద్ర మంత్రి పదవుల నుంచి తప్పుకోనున్నారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో నూతన ముఖ్యమంత్రులను బీజేపీ అధిష్టానం ఇంకా నియమించలేదు.

ఎంపీ పదవులకు రాజీనామా చేసిన వచ్చిన వారిలో కొందరికి  ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించబోతున్నానని తెలుస్తోంది. మరోవైపు కేంద్రంలో మూడు మంత్రి పదవులు ఖాళీ అవుతున్నాయి. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కంటే ముందే ఈ మూడు పదవులను భర్తీ చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోచిస్తున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి లబ్ధి చేకూరేలా ఈ భర్తీ ఉంటుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు.

Advertisement
Advertisement