కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు షాక్‌

No Felling Of Trees In Delhi Till July 4 Delhi High Court - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ రాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి షాక్‌ తగిలింది. కేంద్రం చేపట్టిన జాతీయ భవనాల నిర్మాణం (ఎన్‌బీసీసీ) ప్రాజెక్టుకు అంతరాయం ఏర్పడింది. ఎన్‌బీసీసీ నిర్మాణం కోసం ఢిల్లీలో గత కొద్ది రోజలుగా చెట్లు నరికివేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఢిల్లీ హైకోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. జూలై నాలుగవ తేదీ వరకు ఒక్క చెట్టును కూడా నరకడానికి వీళ్లేదని హైకోర్టు ఆదేశించింది. ఎన్‌బీసీసీ ప్రాజెక్టు కోసం ఢిల్లీలోని 14000 చెట్లను నరికివేతకు కేంద్ర అటవీశాఖ అనుమతులు జారీ చేసిన విషయం తెలిసిందే. చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా పర్యాటక ఉద్యమకారుడు, డాక్టర్‌ కుషాల్‌కాంత్‌ మిశ్రా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కాలనీల కోసం సరోజినీ నగర్‌లో ఇప్పటికే 4500 చెట్లు నరికి వేశారని, మరో 14000 చెట్లు నరికివేసేందుకు కేంద్రం సిద్ధమైందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్‌ ఏకే చావ్లా, నవీన్‌ చావ్లాలతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణ (జాలై 4) వరకు ఒక్క చెట్టు కూడా తొలగించకూడదని తీర్పు వెలువరించింది. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించకముందే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఎన్‌బీసీసీ చైర్మన్‌ ఏకే మిట్టల్‌ను నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌( ఎన్జీటీ) గతంలోనే ఆదేశించింది. చెట్ల నరకివేతకు వ్యతిరేకంగా ఢిల్లీ ప్రజలు చేపట్టిన చిప్కో ఉద్యమానికి అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. చెట్లను ఆలింగనం చేసుకుని వాటిని కాపాడాలంటూ పర్యావరణ ప్రేమికులు ఆందోళనలు చేశారు. ఎన్‌బీసీసీ ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి పలు విమర్శలను ఎదుర్కొంటోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top