విడిభాగాలు భారత్‌లోనే తయారీ: నిర్మల

Nirmala Sitharaman Says Govt Will Notify List Of Weapons For Ban On Import - Sakshi

న్యూఢిల్లీ: రక్షణ రంగం, భద్రతా సిబ్బందికి అవసరమైన అధునాతన ఆయుధాలు, పరికరాలను భారత్‌లోనే తయారుచేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆయుధాలపై క్రమక్రమంగా నిషేధం విధించి... ఆ జాబితాను నోటిఫై చేస్తామని తెలిపారు. అదే విధంగా రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని ఆటోమేటిక్‌ రూట్‌లో 49 శాతం నుంచి 75 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటన చేశారు. దేశీయ మూలధన సేకరణ కోసం బడ్జెట్‌లో ప్రత్యేక ప్రొవిజన్‌ పెడతామన్నారు. రక్షణ పరికరాల దిగుమతి వ్యయాన్ని తగ్గించుకుంటామని పేర్కొన్నారు. మేకిన్‌ ఇండియాను బలోపేతం చేస్తూ... దిగుమతి చేసుకునే విడిభాగాలను భారత్‌లోనే తయారు చేస్తామని వెల్లడించారు. (నిర్మాణాత్మక సంస్కరణలకు ప్రాధాన్యం)

ఇక రాబోయే కాలంలో భారత్‌ విమానాల నిర్వహణ, మరమతులు, పరిశోధనలకు గ్లోబల్‌ హబ్‌ మారుతుందని నిర్మల అన్నారు. భారత గగనతల వినియోగ నిబంధనలు సులభతరం చేస్తామని.. తద్వారా పౌర విమానయానం మరింత మెరుగుపడుతుందన్నారు. తద్వారా ఏడాదికి రూ. 1000 కోట్ల మేర విమానయాన రంగానికి లబ్ది చేకూరనుందని వ్యాఖ్యానించారు. పీపీపీ విధానంలో భాగంగా ప్రైవేటు కంపెనీల ఆధ్వర్యంలో ఉన్న 12 ఎయిర్‌పోర్టులతో పాటుగా.. మరో ఆరు విమానాశ్రయాలను సైతం ప్రైవేటు సంస్థకు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు.  కరోనా సంక్షోభంతో కుదేలైన ఆర్థిక రంగ పునరుత్తేజం, స్వావలంబన భారత్‌ లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజ్‌కు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ నిర్మలా సీతారామన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.(పన్నులు తగ్గించినా ఫలితం లేదు!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top