'పెట్రోల్‌' వ్యాఖ్యలపై భగ్గుమన్న నెటిజన్లు

Netizens fires on KJ Alphons comments over Petrol prices

తిరువనంతపురం :
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌ ధరల పెంపును సమర్థిస్తుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కేజే ఆల్ఫాన్స్‌ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు భగ్గుమన్నారు. 'పెట్రోల్‌ ధరల పెంపు వల్ల వచ్చే ఆదాయం అంతా కూడా పేదల సంక్షేమం కోసమే ఉపయోగిస్తాం. కారు, బైక్‌ ఎవరైతే వాడతారో వారే పెట్రోల్‌ కొనుగోలు చేస్తారు. వారిని దృష్టిలో పెట్టుకునే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అలాంటి వ్యక్తులు సాధారణంగానే ఆకలితో అలమటిస్తున్నవారు కాదు. మేం పన్నులు విధిస్తుంది పేదల జీవితాలను తీర్చిదిద్ది వారికి గౌరవమైన జీవితాన్ని ఇచ్చేందుకే. ఈ మార్గంలో వస్తున్న డబ్బంతా కూడా ప్రభుత్వం దోచుకుంటున్న సొమ్ముకాదు.. ఎవరు చెల్లించగలరో వారికే పన్నులు విధిస్తున్నాం' అంటూ అటు పెట్రోల్‌ ధరల పెంపును, పన్నుల విధానాన్ని కేజే ఆల్ఫాన్స్‌ సమర్థించుకున్నారు.

అసలే పెట్రోల్‌ ధరలు రోజు రోజుకు పెరుగుతూ ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే మంత్రి వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. మంత్రి వ్యాఖ్యలపై ఒక్కసారిగా నెటిజన్లు విరుచుకుపడ్డారు. కార్లు, బైక్‌లు కేవలం డబ్బున్న వాళ్లే వాడతారంటున్నారు. అలాంటప్పుడు మీరు చెప్పినట్టుగానే పేదవారు ప్రయాణించడానికి ఉపయోగించే బస్సులు, రైళ్ల టికెట్‌ల ధరలను ఎందుకు పెంచుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వాహనాల వాడకాన్ని మానేసి ముందు పెట్రోల్‌ కొని తిరగండి సామాన్యుల బాధలు అప్పడు తెలుస్తాయి. పూట గడవక బైక్ ల మీద ఊర్లల్లో వీధుల్లో తిరిగి కూరగాయలు, స్టీల్, ప్లాస్టిక్ సామాన్లు, అల్లం వెల్లుల్లి, పచ్చళ్లు,బట్టలు అమ్ముకొనే వారి సంగతేంటి సారూ అంటూ నెటిజన్లు మండిపడ్డారు.
సాక్షి ఫేస్‌బుక్‌ పేజీలో మంత్రి వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన


కాగా, తాను పెట్రోల్‌ ధరలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదంటూ మంత్రి కేజే ఆల్ఫాన్స్‌ శనివారం సాయంత్రం చెప్పుకు రావడం గమనార్హం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top