నేవీలోకి త్వరలో 56 యుద్ధనౌకలు

Navy Looking At Inducting 56 Warships And Submarines - Sakshi

చైనా, పాక్‌లపై భారత్‌దే పైచేయి

నేవీ చీఫ్‌ లాంబా

న్యూఢిల్లీ: భారత నావికాదళంలోకి త్వరలోనే 56 కొత్త యుద్ధనౌకలు, ఆరు జలాంతర్గాములు చేరనున్నట్లు నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ సునీల్‌ లాంబా తెలిపారు. సోమవారం నావికాదళ దినోత్సవం(నేవీ డే) సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లాంబా మాట్లాడుతూ.. ‘2050 నాటికి 200 యుద్ధనౌకలు, 500 సొంత యుద్ధ విమానాలతో భారత నేవీ ప్రపంచస్థాయి నౌకాదళంగా తయారవుతుంది’ అని తెలిపారు. ప్రస్తుతం దేశంలోని వేర్వేరు షిప్‌యార్డుల్లో 32 నౌకలు, జలాంతర్గాములు నిర్మాణంలో ఉన్నాయన్నారు. వీటిని అదనంగా తాజాగా మరో 56 యుద్ధనౌకలు, 6 జలాంతర్గాముల చేరికకు కేంద్రం పచ్చజెండా ఊపిందని వెల్లడించారు.

చైనా, పాక్‌తో ద్విముఖ పోరు సంభవిస్తే నేవీ ఎలా ఎదుర్కొంటుందన్న మీడియా ప్రశ్నకు..‘పాక్‌ నేవీ కంటే మనం చాలాముందున్నాం. ఇక హిందూ మహాసముద్రం పరిధిలో చైనాపై మనదే పైచేయిగా ఉంది’ అని పేర్కొన్నారు. భారత త్రివిధ దళాలకు ఉమ్మడి అధిపతి (చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌–సీడీఎస్‌)ని నియమించాలన్న ప్రతిపాదనకు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో అంగీకారం కుదిరిందనీ, త్వరలోనే ఈ విషయాన్ని రక్షణ శాఖకు నివేదిస్తామని లాంబా అన్నారు.

రిలయన్స్‌కు షాకిచ్చిన నేవీ..
ఐదు ఆఫ్‌షోర్‌ పెట్రోలింగ్‌ నౌకలను నిర్ణీత సమయంలోగా అందించలేకపోయిన రిలయన్స్‌ నేవల్‌ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎన్‌ఈఎల్‌)పై భారత నేవీ కొరడా ఝుళిపించింది. కాంట్రాక్టు సందర్భంగా రిలయన్స్‌ సమర్పించిన బ్యాంకు గ్యారెంటీని నేవీ స్వాధీనం చేసుకుంది. ఈ విషయమై నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ సునీల్‌ లాంబా స్పందిస్తూ..‘రిలయన్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటాం. కాంట్రాక్టును రద్దుచేయాలా? వద్దా? అనే విషయమై కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుంది’ అని తెలిపారు.  నౌకల నిర్మాణానికి రూ.3,200కోట్ల కాంట్రాక్టు దక్కించుకున్న  పిపవావ్‌ డిఫెన్స్, ఆఫ్‌షోర్‌ ఇంజనీరింగ్‌ సంస్థను 2016లో ఆర్‌ఎన్‌ఈఎల్‌ కొనుగోలు చేయడం తెల్సిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top