తేజస్‌ ‘అరెస్టెడ్‌ ల్యాండింగ్‌’ సక్సెస్‌

Naval Tejas Clears Critical Test Before Landing On Aircraft Carrier - Sakshi

న్యూఢిల్లీ: పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసుకున్న తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్‌’మరో అరుదైన ఘనత సాధించింది. గోవాలోని ఓ నావికా కేంద్రంలో తొలిసారి విజయవంతంగా అరెస్టెడ్‌ ల్యాండింగ్‌ను పూర్తి చేసింది. అతి తక్కువ స్థలం మాత్రమే ఉండే విమాన వాహక నౌకలపై సమర్థవంతంగా దిగేందుకు అరెస్టెడ్‌ ల్యాండింగ్‌ ప్రక్రియను ఉపయోగిస్తారు. విమానం ముందుభాగంలో ఉన్న కొక్కెం ల్యాండింగ్‌ సమయంలో డెక్‌పై ఉన్న ఓ తీగను అందుకోవడం ద్వారా వేగాన్ని నియంత్రించుకుంటుంది. తద్వారా తక్కువ పొడవున్న విమాన వాహక యుద్ధ నౌక రన్‌వేపై సులువుగా ల్యాండ్‌ అవుతుంది.

నిమిషానికి 1,500 అడుగుల వేగంతో ప్రయాణిస్తూ.. యుద్ధ విమానానికి ఏ మాత్రం నష్టం కలగకుండా ల్యాండ్‌ కావడం ఈ ప్రక్రియలోని విశేషం. ఇది విజయవంతంగా పూర్తవడంతో నేవీలోనూ తేజస్‌ సేవలు ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. నేవీ కోసం ప్రస్తుతం రెండు తేజస్‌ విమానాలను పరీక్షిస్తున్న విషయం తెలిసిందే. ఒకే ఒక్క సీటుండే తేజస్‌తో అరెస్టెడ్‌ ల్యాండింగ్‌ విజయవంతం కావడంతో అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాల తరువాత ఈ సామర్థ్యమున్న యుద్ధ విమానాన్ని రూపొందించిన ఘనత భారత్‌కే దక్కింది. మరి కొన్నిసార్లు ఇదే ఫలితాలను సాధిస్తే పరీక్ష కేంద్రంలో కాకుండా అసలైన యుద్ధనౌకపై అరెస్టెడ్‌ ల్యాండింగ్‌ కోసం ప్రయత్నాలు మొదలవుతాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top