దివ్యాంగ విద్యార్థినికి మోదీ ప్రశంస

Narendra Modi Praises Disabled Girl In Mann Ki Baat - Sakshi

న్యూఢిల్లీ : సాధించిన విజయాన్ని ఎవరైనా గుర్తించినప్పుడు కలిగే సంతోషం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటింది ఓ దివ్యాంగ విద్యార్థిని సాధించిన విజయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తించి దేశ ప్రజలకు తెలుపడంతో.. ఆ బాలిక ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గురుగ్రామ్‌కు చెందిన 15 ఏళ్ల అనుష్క పాండా వెన్నుముక్కలో కండరాల క్షీణత వల్ల వీల్‌ చైర్‌కే పరిమితమయ్యారు. కానీ తల్లిదండ్రుల ప్రొద్భలంతో తన కలలను నెరవేర్చుకోవడానికి సిద్ధపడ్డారు. ఎన్ని అవంతరాలు ఎదురైనా తన సంకల్పాన్ని మాత్రం వదలలేదు. వీల్‌ చైర్‌లోనే సన్‌ సిటీ స్కూల్‌కు వెళుతూ సీబీఎస్‌ఈ పదవ తరగతి ఫలితాల్లో 97.8 శాతం మార్కులతో టాప్‌ ర్యాంక్‌(వికలాంగుల విభాగంలో) సాధించారు.

ఈ విషయం మోదీ దృష్టికి వెళ్లడంతో.. ఆదివారం నాటి మన్‌కీ బాత్‌లో ప్రధాని మాట్లాడుతూ.. అనుష్క ప్రతిభను కొనియాడారు. ఆమె సాధించిన విజయం అద్భుతమని, ఇది ఎందరికో ఆదర్శప్రాయమని తెలిపారు. అనుష్క వెన్నుముక్కలోని కండరాల క్షీణతతో బాధపడుతున్నప్పటికీ.. సమస్యలను అధిగమించి అల్‌ ఇండియా టాపర్‌గా నిలిచారని అభినందించారు. అనుష్కలాగా ఎంతో మంది పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు వారికి ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల నుంచి బయటకు రాలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బలమైన సంకల్పంతో కష్టపడితే వారు ఎలాంటి లక్ష్యాన్ని అయిన చేరుకోవచ్చని మోదీ వ్యాఖ్యానించారు.

చిన్నప్పటి నుంచి అనుష్క జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు ఆమె తల్లిదండ్రులు పేర్కొన్నారు. ప్రధాని ప్రసంగంలో తనకు శుభాకాంక్షలు తెలపడంపై అనుష్క ఆనందం వ్యక్తం చేశారు. అలాగే మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఐఐటీలో సీటు సాధించి.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కావడమే తన లక్ష్యమని అనుష్క వెల్లడించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top