‘ఈ ఆర్డినెన్స్‌తో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు’

Muslim Law Board Says Triple Talaq Ordinance Murder of Democracy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘ట్రిపుల్‌ తలాక్‌’ను నేరంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకరావడం పట్ల ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ కోర్టుకు వెళ్తామంటూ గురువారం ప్రకటించింది. పార్లమెంటు ఆమోదం పొందకుండానే ఆర్డినెన్స్‌ తీసుకువచ్చి కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని వ్యాఖ్యానించింది. చట్టసభలను గౌరవించకుండా కేంద్రం నిరంకుశంగా వ్యవహరించిందంటూ లా బోర్డు విమర్శించింది.

దొడ్డిదారిన ఎందుకు తెచ్చారు?
ఆల్‌ ఇండియా ముస్లిం లా బోర్డు జనరల్‌ సెక్రటరీ మౌలానా ఖలీద్‌ సైఫ్‌ ఉల్లా రహ్మానీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం దొడ్డి దారిన ట్రిపుల్‌ తలాక్‌ ఆర్డినెన్స్‌ తీసుకువచ్చిందని ఆరోపించారు. అసలు ముస్లిం వర్గాల అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా ఎలా వ్యవహరిస్తారంటూ ప్రశ్నించారు. ముస్లిం మహిళలకు హాని కలిగించే విధంగా ఉన్న ఆర్డినెన్స్‌ను సుప్రీం కోర్టులో సవాలు చేసే అంశంపై తమ లీగల్‌ కమిటీ చర్చిస్తోందని తెలిపారు.

వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే : అసదుద్దీన్‌ ఒవైసీ
ట్రిపుల్‌ తలాక్‌ ఆర్డినెన్స్‌ ఓ నాటకమని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మండిపడ్డారు. రఫెల్‌ డీల్‌, నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ ఉదంతాలు, పెరుగుతున్న ఇంధన ధరల గురించి ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుందనే భయంతో బీజేపీ ఇటువంటి నాటకాలు ఆడుతోందని విమర్శించారు.

కాగా ‘ట్రిపుల్‌ తలాక్‌’ను నేరంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం గత బుధవారం ఆర్డినెన్స్‌ తీసుకు వచ్చింది. ఈ ఆర్డినెన్స్‌ను ఆమోదిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతకం చేశారు. ఏకాభిప్రాయం కుదరని కారణంగానే ట్రిపుల్‌ తలాక్‌ ఆర్డినెన్స్‌ తీసుకువచ్చామని న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వివరించారు. లోక్‌సభలో ఆమోదం పొందినప్పటికీ రాజ్యసభలో మాత్రం ఈ బిల్లు ఆమోదం పొందలేదు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top