సాక్షి ముంబై: మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ సత్తా చాటింది. ముంబైతోపాటు మరాఠ్వాడాలోని మున్సిపల్ కార్పొరేషన్‌లలో ఎంఐఎం పార్టీ తన ప్రభావం చూపింది. రాష్ట్రంలోని 29 మున్సిపల్ కార్పొరేషన్‌లకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 125 స్థానాలను దక్కించుకుని తన పట్టును పెంచుకుంది. రాష్ట్రంలోని ముస్లిం ఓటర్లు ఎంఐఎంకు పెద్దఎత్తున మద్దతు పలికినట్టు ఫలితాలను బట్టి తెలుస్తోంది. ముస్లిం ఓటర్లు కాంగ్రెస్, ఎన్సీపీలను తిరస్కరించి ఎంఐఎంవైపు మొగ్గుచూపారని తాజా ఎన్నికల ఫలితాలతో స్పష్టమైంది.
ఛత్రపతి సంభాజీనగర్‌లో హవా
ఛత్రపతి సంభాజీనగర్ (ఔరంగాబాద్) మున్సిపల్ కార్పొరేషన్‌లో గతంలోకంటే అధికంగా 33 స్థానాలు దక్కించుకుని రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక్కడ కాంగ్రెస్, ఇరు ఎన్సీపీలు, ఇరు శివసేనల కంటే అధిక స్థానాలు దక్కించుకోవడం విశేషం. ముఖ్యంగా ఎంఐఎం ఎంపీ సయ్యద్ ఇంతియాజ్ జలీల్ (Syed Imtiaz Jaleel) నేతృత్వంలో జరిగిన ఈ ఎన్నికల్లో మరోసారి ఆయన తన సత్తాను చాటుకున్నారు. ఎన్నికల ప్రచారం సమయంలో ఆయనపై దాడి జరిగింది. దీంతో ఇంతియాజ్ జలీల్ ఈ ఎన్నికలకు మరింత ప్రతిష్ఠాత్మంగా తీసుకుని ప్రచారం చేసి 33 స్థానాలను దక్కించుకున్నారు.
అమరావతి, నాందేడ్‌లలో..
మాలేగావ్, నాందేడ్, అమరావతి, ధులే, ముంబై, షోలాపూర్, నాగపూర్, థానే(ముంబ్రా) మున్సిపల్ కార్పొరేషన్‌లలో కూడా ఎంఐఎం తన ప్రభావం చూపింది. ముఖ్యంగా మాలేగావ్‌లో 20 స్థానాలు దక్కించుకోగా నాందేడ్‌లో 15, అమరావతిలో 12, ధులేలో 10 చోట్ల విజయం సాధించింది. ముంబైలో 8, షోలాపూర్‌లో 8, నాగపూర్‌లో 6, థానేలో 5 స్థానాల్లో గెలిచింది. అకోలా (3), జాల్నా (2), అహ్మద్‌నగర్ (2) లలో ఉనికిని చాటుకుకుంది. చంద్రాపూర్‌లో మొట్టమొదటి సారిగా ఒక్కస్థానం దక్కించుకుని బోణి కొట్టింది.
మహారాష్ట్ర ప్రజలకు ఒవైసీ ధన్యవాదాలు
మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో (Maharashtra civic polls 2026) తమ పార్టీకి చెందిన 125 మంది కార్పొరేటర్లు విజయం సాధించారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. తమ పార్టీకి ఓటు వేసిన మహారాష్ట్ర ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తమ పార్టీ కార్పొరేటర్లు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారని అన్నారు. ''మా కార్పొరేటర్లందరూ ప్రజల మధ్యే ఉండి, మీ వార్డులలో అభివృద్ధి పనులు చేపట్టాలని నేను గట్టిగా కోరుతున్నాన''ని ఎక్స్‌లో పేర్కొన్నారు.
చదవండి: కాంగ్రెస్ ఘోర పరాభవానికి కారణాలు ఇవే


