లాక్‌డౌన్‌: తండ్రి చివరి చూపు దక్కినా చాలు | Mumbai Watchman Cycling 2100 km To Jammu Kashmir Rajouri For Father | Sakshi
Sakshi News home page

ప్రాణాపాయంలో తండ్రి.. 2100 కి.మీ సైకిల్‌ యాత్ర

Apr 5 2020 11:31 AM | Updated on Apr 5 2020 3:33 PM

Mumbai Watchman Cycling 2100 km To Jammu Kashmir Rajouri For Father - Sakshi

ముంబై: క‌నిపెంచిన త‌ల్లిదండ్రుల‌ను భారంగా భావించే పిల్ల‌లు కోకొల్ల‌లు. రెక్క‌లు రాగానే క‌న్న‌వాళ్ల‌ను ఓల్డేజ్ హోమ్‌లో వ‌దిలేసే వారి సంఖ్య నానాటికీ పెరుగుతూ వ‌స్తోంది. అలాంటి ప‌రిస్థితుల్లో ఓ వ్య‌క్తి త‌న తండ్రి కోసం ఏకంగా 2,100 కి.మీ సైకిల్‌ ప్రయాణం మొదలు పెట్టాడు. క‌రోనా భ‌యాన్ని ప‌ట్టించుకోకుండా, ప్ర‌భుత్వ ఆంక్ష‌ల‌ను లెక్క చేయ‌కుండా తండ్రిని కాపాడుకోవ‌డ‌మే ధ్యేయంగా ఆయ‌న ప‌య‌నం ప్రారంభించాడు. ఈ హృదయ విదారక ఘ‌ట‌న దేశ‌ ఆర్థిక రాజ‌ధాని ముంబైలో చోటు చేసుకుంది. వివ‌రాలు.. ముంబైకి చెందిన మ‌హ్మ‌ద్ ఆరిఫ్ వాచ్‌మెన్‌గా ప‌నిచేస్తున్నాడు. మంగ‌ళ‌వారం జ‌మ్ము క‌శ్మీర్‌లో ఉన్న అత‌ని తండ్రికి గుండెపోటు వ‌చ్చింద‌ని ఇంటి నుంచి ఫోన్ వ‌చ్చింది. అత‌ని ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని, ఏం చేయాలో అర్థం కావ‌ట్లేద‌ని కుటుంబీకులు ఘొల్లుమ‌న్నారు. 
(మేక‌ప్ వేసుకోండి: భార్య‌ల‌కు ప్ర‌భుత్వ స‌ల‌హా)

దీంతో ఆరిఫ్‌ వెంట‌నే జ‌మ్ముక‌శ్మీర్‌లోని రాజౌరీకి ప‌య‌న‌మయ్యేందుకు సిద్ధ‌మ‌య్యాడు. కానీ లాక్‌డౌన్ వ‌ల్ల ర‌వాణా వ్య‌వ‌స్థ స్థంభించిపోవ‌డంతో ఏం చేయాలో పాలుపోలేదు. అయితే తండ్రిని ఎలాగైనా ర‌క్షించుకోవాల‌ని రూ.500తో ఓ వ్య‌క్తి వ‌ద్ద‌ సైకిల్‌ను కొని గురువారం ఉద‌యం 10 గంట‌ల‌కు స్వస్థలానికి బ‌య‌లు దేరాడు. ఈ క్ర‌మంలో మ‌ధ్య‌లో కొంద‌రు పోలీసులు ఆపిన‌ప్పుడు వారికి త‌న ప‌రిస్థితి వివ‌రించిన‌ప్ప‌టికీ ఎలాంటి సహాయం చేయ‌లేద‌ని చెప్పుకొచ్చాడు. ప్ర‌స్తుతం ఆరిఫ్ మ‌హారాష్ట్ర‌ను దాటి గుజ‌రాత్‌లోకి అడుగుపెట్టాడు. త‌న‌కు అన్న‌ద‌మ్ములెవ‌రూ లేక‌పోవ‌డంతో తండ్రిని చూసుకునే బాధ్య‌త తానొక్క‌డిమీద‌నే ఉంద‌న్నాడు.  ముంబై నుంచి కేవలం రూ.800 తో బయల్దేరానని.. త‌న మొబైల్‌లో చార్జింగ్ కూడా అయిపోయింద‌ని ఆయన వాపోయాడు. తండ్రిని కాపాడుకోలేకపోయినా.. ఆయన చివరి చూపు దక్కినా చాలని ఆరిఫ్‌ చెప్తున్న తీరు కలచివేసింది. రాత్రిపూట రోడ్డు ప‌క్క‌న ప‌డుకుని, వేకువ‌జామునే మ‌ళ్లీ ప్ర‌యాణం చేస్తున్నాన‌న్నాడు. అయితే లాక్‌డౌన్ వల్ల ఆహారం కూడా దొర‌క‌డం లేద‌ని, కేవ‌లం బిస్క‌ట్లు మాత్ర‌మే తింటున్నానన్నాడు. ఇక‌ ఆరిష్‌ విష‌యం జ‌మ్ము క‌శ్మీర్ అధికారుల దృష్టికి వెళ్ల‌గా అత‌నికి సాయం చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.
(లాక్‌డౌన్‌: బ్లాక్‌ అండ్‌ వైట్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement