లాక్‌డౌన్‌: బ్లాక్‌ అండ్‌ వైట్‌

Vardelli Murali Writes Guest Column About India Lockdown - Sakshi

జనతంత్రం

నూటా ముప్పయి కోట్ల జనం, ముక్కోటి దేవతల వారసత్వం, ముప్పయ్‌ మూడు ప్రాంతీయ రాజ్యాలు, మున్నూరు మతాలు–విశ్వాసాలు, లెక్కలేనన్ని భాషలు– సంస్కృతులతో కూడిన ఉపఖండం భారతదేశం. అటు వంటి దేశానికి ఇరవై నాలుగ్గంటల నోటీసు కూడా ఇవ్వకుండా తాళం వేసేయడానికి ఎన్ని గుండెలు కావాలి? అన్ని గుండెలకు వసతి సౌకర్యం కల్పించే ఛాతీ చుట్టుకొలత ఎన్ని ఇంచులుండాలి? భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్రభాయ్‌ దామోదరదాస్‌ మోదీకి ఎన్ని గుండెలు ఉన్నాయో తెలియదు కానీ, ఈ క్షణాన మాత్రం ఆయనను చూసి భారతీయ ‘భద్రలోక్‌’ పరవశించిపోతు న్నది. ట్రంప్‌ చేయలేని పని, ఇటలీ అధ్యక్షునివల్లకాని పని, ఐరోపా నాయకత్వం సాహసించలేని కార్యాన్ని మోదీ అవలీలగా చేసిపారేశాడని మన భద్రలోక్‌ కీర్తిస్తు న్నది. వడ్డించిన విస్తరి వంటి జీవితాలను బెంగాలీలు భద్రలోక్‌ అని పిలుస్తారు. ఆరంకెలు దాటిన నెలసరి ఆదాయం పొందే వాళ్లందరినీ మనం ఈ భద్రలోక్‌ వర్గీకరణలో వేసేయవచ్చు. తెలుగు నవలా సాహిత్యాన్ని మహిళా రచయిత్రులు పరిపాలించిన కాలంలో నాలు గంకెల ఆదాయంగల వారి జీవితాలను చాలా రొమాం టిక్‌గా వర్ణించారు. ద్రవ్యోల్బణం కారణంగా ఆరంకెల యితే తప్ప ఇప్పుడు ఆ జీవితం సాధ్యం కాదు. సదరు భద్రలోక్‌కు ఇప్పుడు కావాల్సినంత తీరిక దొరికింది.

రోజుకు పన్నెండుసార్లు చేతులు కడుక్కోవాలనీ, తుమ్ము వస్తే కర్చీఫ్‌ అడ్డం పెట్టుకోవాలని, జ్వరం వస్తే డాక్టరుకు చూపించుకోవాలనీ, ఆకలైతే అన్నం తినాలనీ, దాహం వేస్తే నీళ్లు తాగాలనీ... ఇంకా ఇటువంటి అనేక విలువైన జీవిత సత్యాలను తెలియపరుస్తూ సోషల్‌ మీడి యాలో కొన్ని కోట్ల పోస్టింగులను పెట్టారు. ప్రధాన మంత్రి పిలుపునందుకొని గుమ్మం దాకా వచ్చి గట్టిగా చప్పట్లు కూడా కొట్టారు. ఆ రకంగా, ఈ దేశ ప్రజల ఐక్య తను, సమరశీలతను కరోనా భూతానికి చాటి చెప్పారు. మోదీ కాకుండా మరెవరైనా, ఇంత పెద్ద దేశానికి సరైన సమయంలో లాక్‌డౌన్‌ ప్రకటించి ఉండేవారు కాదని భద్రలోక్‌ గట్టిగా నమ్ముతున్నది. నిజమే, ఒక్కసారి మన పాత ప్రధానమంత్రులందరినీ గుర్తుకు చేసుకుంటే, ఎవరి వల్ల కాగలదు ఈ మహత్కార్యం? బహుశా ఒక్క ఇందిరా గాంధీ వల్ల అవుతుందేమో. ఎందుకంటే, కయ్యానికి కాలుదువ్విన పాకిస్తాన్‌ను అడ్డంగా కోసి పారేసి రెండు ముక్కలు చేసిన అనుభవం, పక్కనే ఉన్న సిక్కింను లాక్కొని భారత్‌లో కలిపేసిన చరిత్ర, అమెరికా రంకెల్ని లెక్క చేయకుండా అణుపాటవాన్ని  పరీక్షించిన సాహసం ఆమె సొంతం. ఆమె తర్వాత అంతటి సాహసం, అంతటి పాపులారిటీ మోదీకి మాత్రమే ఉన్నాయని మన భద్ర లోకంతోపాటు, మెజారిటీ మీడియా కూడా గట్టిగా విశ్వ సిస్తున్నాయి. లాక్‌డౌన్‌ తదనంతరం మోదీ ప్రభ మరో మారు మార్తాండ తేజస్సుతో వెలిగిపోతున్నది. సరిగ్గా ఇటువంటి స్థితిలోనే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ దాకా వెళ్లారు. నరేంద్ర మోదీ అటువంటి అడుగులు వేయ కుండా అయోధ్య రాముడు కటాక్షించుగాక.

లాక్‌డౌన్‌ అంటే ఏమిటి? లాక్‌డౌన్‌ అంటే భద్ర లోక్‌కు ఒక ఆటవిడుపు. ఒక విరామరాగం. సంగీతమూ, గానము, చిత్రలేఖనము, పఠనమూ, పాకశాస్త్రము, ఆర గింపూ, పవ్వళింపూ వగైరా లలితకళల్ని సాధన చేసే సావ కాశం. భద్రలోక్‌ను మినహాయిస్తే మిగిలిన అవశేష భార తీయుల్లో అత్యధికులు రెక్కాడితే గానీ డొక్కాడని పేదలు. వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, హోట ళ్లలో, రెస్టారెంట్లలో దినవేతనంపై పనిచేసేవారు. చిన్న చిన్న కార్ఖానాల్లో రోజువారీ కూలీలు, రిక్షాలాగేవాళ్లు, ఇళ్లలో పనిచేసేవాళ్లు... అంతా కలిపి అసంఘటితరంగ కార్మికులు. వారి సంఖ్య దేశవ్యాప్తంగా సుమారు 50 కోట్లు అని అంచనా. కచ్చితమైన లెక్కల్లేవు కానీ, ఇంకా ఎక్కువే ఉండవచ్చు. లాక్‌డౌన్‌ అంటే వీరందరికీ జీవనా ధార తీగలు తెగిపోవడమే. జీవనాడులు స్తబ్దమైపోవ డమే. వీరిలో రమారమి ఇరవై కోట్లమంది వలస కార్మి కులు. ఏడాదిలో కొన్ని నెలలపాటు మాత్రమే వలసవెళ్లే సీజనల్‌ కార్మికులు కూడా ఇందులో ఉండొచ్చు.

వీరి పరిస్థితి మరింత అధ్వానం. లాక్‌డౌన్‌ ప్రకటనతో ఒక్క సారిగా రెక్కలు తెగిన పక్షుల్లా వీధిన పడ్డారు. నెత్తిన మూటలతో, చంకన బిడ్డలతో వందల కిలోమీటర్ల దూరం నిద్రాహారాలు లేకుండా వలస కార్మికులు నడుస్తున్న దృశ్యాలు మన ప్రజాస్వామ్య వ్యవస్థను నిరం తరం వెంటాడే ప్రశ్నలుగా మిగిలిపోతాయి. వలస కార్మికులతో అధికార యంత్రాంగాలు చాలాచోట్ల ప్రవ ర్తించిన తీరు కూడా తీవ్ర అభ్యంతరకరంగా వుంది. యూపీలోని బరెల్లీలో వందలాదిమంది కూలీలను కూర్చోబెట్టి బ్లీచింగ్‌ పౌడర్‌ కలిపిన నీళ్లను పైపులతో వారిపైన కురిపించిన ఘటన అత్యంత అమానవీయం. చావిట్లో గొడ్లను కడిగే సన్నివేశాన్ని గుర్తు చేసింది. లాక్‌డౌన్‌ పుణ్యమా అని నిరుపేదల ఆత్మగౌరవాన్ని హననం చేసే ఇటువంటి రాజ్యాంగ విరుద్ధ సంఘటనలు అనేకం జరి గాయి.

హఠాద్గర్జనలా వచ్చి పడిన లాక్‌డౌన్‌ అనేక రకాలుగా జీవితాలను అతలాకుతలం చేయడమే గాక, ఆర్థిక వ్యవ స్థకు కూడా పెనుసవాల్‌ను విసరబోతున్నది. మూడు వారాలపాటు లాక్‌డౌన్‌ కొనసాగితే జీడీపీకి తొమ్మిది లక్షల కోట్లు (అంటే 4 శాతం) నష్టం జరుగుతుందని నిపు ణులు చెబుతున్నారు. ఒక లెక్క ప్రకారం జీడీపీ ఒక శాతం తగ్గితే రెండు శాతం ఉద్యోగుల్ని కోల్పోవలసి వస్తుంది. నాలుగు శాతమంటే 8 శాతం ఉద్యోగాలు హరీ! పైగా ఈ మూడు వారాలతోనే కథ కంచికి చేరుతుందన్న గ్యారంటీ లేదు. అందుతున్న సంకేతాలను బట్టి ఈనెల 14 తర్వాత కొద్దిరోజులు విరామం ఇచ్చి మరో రెండు వారాలో, మూడు వారాలో మరోసారి లాక్‌డౌన్‌ ప్రక టించే అవకాశం వుంది. ప్రజల ప్రాణాలు కాపాడటానికి లాక్‌డౌన్‌ అనివార్యమైతే ఎంత నష్టమైనా సరే సహించక తప్పదు. కానీ అంతకంటే ముందు ఇతర ప్రత్యామ్నాయా లపై సరైన కసరత్తు జరిగిందా లేదా అనేది మాత్రం సందేహమే. విదేశాంగ విధానంలో పి.వి.నర్సింహారావు ప్రతిపాదించిన ‘లుక్‌ ఈస్ట్‌’ విధానాన్ని మోదీ మరింత ముందుకు తీసుకొనిపోతున్నారు. కరోనా విషయంలో కూడా ఒకసారి ‘ఈస్ట్‌’ వైపు ఒక ‘లుక్‌’ వేసి వుంటే బాగుండేది.

చైనాలోని చాలా ప్రాంతాలు, హాంకాంగ్, తైవాన్, మరీ ముఖ్యంగా దక్షిణ కొరియా లాక్‌డౌన్‌ లేకుండానే కరోనాను సమర్థంగా ఎదుర్కోగలుగుతున్నాయి. అను మానితులను గుర్తించడం, ఐటీ సహకారంతో వారిని సంపూర్ణంగా జనస్రవంతి నుంచి కొంతకాలం దూరం చేయడం అనే విధానాన్ని అవలంబించిన దక్షిణ కొరియా సత్ఫలితాలను సాధించగలిగింది. ఇటువంటి అనుభవా లపై దృష్టి పెట్టవలసింది. అందుకు తగినంత సమయం కూడా లాక్‌డౌన్‌కు ముందు లభించింది. జనవరి 30వ తేదీనాడు భారత్‌లో తొలి పాజిటివ్‌ కేసు నమోదైంది. ఆ తర్వాత దేశంలో పార్లమెంట్‌ సమావేశాలు జరిగాయి. సీఏఏ మీద రాజకీయ పోరాటాలు జరిగాయి. ‘నమస్తే ట్రంప్‌’ జరిగింది. మొదటి మరణం మార్చి 12న రికార్డ య్యింది. ఈ మధ్యకాలంలో 15 లక్షల మంది విదేశాల నుంచి భారత్‌కు చేరుకున్నారు. వీరి గుర్తింపు, ఐసోలేషన్‌ పద్ధతిగా జరిగి వుంటే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చేది కాదన్న అభిప్రాయం కూడా వుంది. కానీ గతం గతః. ఇప్పుడు లాక్‌డౌనే శరణ్యం. విజయవంతం చేయటం అందరి బాధ్యత. గొప్ప నాయకత్వ లక్షణాలతో పాటు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కళ కూడా మోదీకి బాగానే వుంది. ఈరోజు ఈవెంట్‌ దీపయజ్ఞం. ఆయనకు ఉన్న ఇమేజ్‌ కారణంగా ఈవెంట్‌ గ్రాండ్‌ సక్సెస్‌ అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఢిల్లీలో ప్రధానమంత్రి కరోనాపై పోరాట వ్యూహా లతో, సమీక్షలతో, వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడుతూ బిజీగా వుంటూనే ప్రజలను సంఘటితం చేసే ఈవెంట్లకు పిలుపునిస్తున్నారు. ఢిల్లీకి రోడ్డు మార్గాన 15 వందల కిలోమీటర్లు, వాయుమార్గాన రెండుగంటల టైమ్‌ దూరంలో వున్న హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టుకు సమీపంలో ఉన్న ఒక ఖరీదైన బంగళాలో గడప దాట కుండా వున్న ప్రముఖ రాజకీయ నాయకుడు, ఆంధ్ర ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా అసహనంగా వున్నారు. ఈయనకు ఈవెంట్‌ మేనే జ్‌మెంట్‌ అంటే చాలా ఆసక్తి. మోదీలాగా నాయకత్వ లక్షణాలు లేవుగానీ, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌లో మోదీకి గట్టి పోటీ ఇవ్వగల చతురత మాత్రం చంద్రబాబుకే వుంది. ఒక మెగా ఈవెంట్‌ మిస్సయ్యానన్న బాధ ఆయ నలో వుంది. దాన్ని దాచుకోలేకపోతున్నారు. అక్కడికీ ప్రెస్‌మీట్లు పెట్టి ‘‘చేతులు బాగా కడుక్కోండి. గట్టిగా ఆవిరి పట్టండి. మంచినీళ్లు బాగా తాగండి’’ అని ప్రజల నుద్దేశించి చెబుతున్నారు. కానీ, ఇది ఆయన దాహానికి సరిపోవడం లేదు. దీంతో అసహనం రాష్ట్ర ప్రభుత్వం మీదకు మళ్లింది. ‘నిర్ధారణ పరీక్షలు సరిగ్గా జరగడం లేదు. కేసులు ఇంకా ఎక్కువే ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం దాచిపెడుతోంది’ అంటూ వింత విమర్శలు ప్రారంభిం చారు. తాను కాకుండా తన అనుయాయులతోనూ విమ ర్శలు చేయించడం మొదలుపెట్టారు.
 
జాతీయ స్థాయిలోగానీ, వివిధ రాష్ట్రాల్లో గానీ విపత్తు వేళ రాజకీయ విమర్శలకు దిగిన ఏకైక ప్రతి పక్షంగా తెలుగుదేశం పార్టీ మిగిలిపోతుంది. వాస్తవానికి కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి చాలా ముందస్తు వ్యూహంతో టెక్నాలజీని వినియోగించుకుంటూ ఆంధ్రప్ర దేశ్‌ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించింది. టెక్నాలజీ సహకారంతో ఏ విధానాలను అవలంబించి దక్షిణా కొరియా సత్ఫలితాలను సాధించిందో అవే విధా నాలను టెక్నాలజీకి అదనంగా వలంటీర్‌ వ్యవస్థను కూడా జోడించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేసింది. కరోనా వైరస్‌ భారత్‌లో ప్రారంభమైన తర్వాత రాష్ట్రం లోకి విదేశాల నుంచి వస్తున్నవారినందరినీ వలంటీర్‌ వ్యవస్థ ద్వారా గుర్తించడం ప్రారంభించారు. తొలిదశలో జరిగిన సర్వేలో 13 వేలుగా తేలిన సంఖ్య, తర్వాత క్రమం తప్పకుండా జరిగిన సర్వేలతో మొత్తం 26 వేల మందిని గుర్తించారు. వారిలో ఇప్పటికే చాలామందిని మొబైల్‌ ఫోన్ల ద్వారా జియో ట్యాగింగ్‌ చేశారు. వారి కదలికలు ఎప్పటికప్పుడు పోలీసులకు తెలిసిపోతు న్నాయి. వారికి పకడ్బందీగా వైద్య పర్యవేక్షణను కూడా ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో చాలా మందికి ఇప్పటికే క్వారంటైన్‌ పీరియడ్‌ పూర్తయింది. పాజిటివ్‌ కేసులు 21 మాత్రమే ఇప్పటి దాకా తేలాయి. ఇందులో ఐదుగురికి ఇప్పటికే చికిత్స పూర్తయింది. డిశ్చా ర్జయ్యారు. మిగిలి ఉన్న పాజి టివ్‌ కేసులు 16 మాత్రమే. ఇక ఏదో అదృశ్యశక్తి మంత్ర బలంతో అమాంతంగా ఏపీలో కరోనా కేసులు పెరగక పోతాయా అని ప్రతిపక్షం ఆశించినట్టుగానే, ఢిల్లీ మర్కజ్‌ రూపంలో ఆ అదృశ్యశక్తి ప్రభావం కనిపించింది.

21 ఫారిన్‌ కేసులు మినహా ఏపీలో మిగిలినవన్నీ మర్కజ్‌ కేసులే. వారిలో కూడా 850 మందిని, వారి కాంటాక్టులను ఇప్పటికే గుర్తించి క్వారంటైన్‌ చేయడం జరిగింది. మిగిలిన 100 మందినీ వారి కాంటాక్టులను గుర్తించి క్వారంటైన్‌ చేస్తే, రాష్ట్రంలో వైరస్‌ ఇంకా కమ్యూ నిటీ విస్తరణ దశకు చేరుకోనందువలన అక్కడితో కట్టడి చేయగలమన్న విశ్వాసంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. గడి చిన వారం రోజులుగా ఇంటింటి ఆరోగ్య సర్వేను రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చేపట్టింది. మొత్తం 1 కోటీ 45 లక్షల కుటుంబాలకు గాను, 1 కోటీ 30 లక్షల కుటుం బాల సర్వే పూర్తయింది. దగ్గు, జ్వరమూ, శ్వాస సంబంధ సమస్యలూ వంటి కరోనా పాజిటివ్‌ లక్షణాల్లో  ఏ ఒక్క టైనా ఉన్నవారి గుర్తింపుకోసం ఈ సర్వే జరిగింది.  ఇప్పటివరకు 3,500 మందికి ఏదో ఒక కంప్లయింట్‌ ఉన్నట్టు తేలింది. వీరిపై మరోసారి వైద్య పరిశీలన జరు గుతుంది. ఎవరికైనా పాజిటివ్‌ లక్షణాలున్నట్లయితే వారిని క్వారంటైన్‌ చేయడం జరుగుతుంది. అప్పటికి ఎవ రికి కరోనా పాజిటివ్‌ ఉందో, ఎవరికి లేదో స్పష్టమైన విభ జన ఏర్పడుతుంది.

రాష్ట్ర ప్రభుత్వం పనితీరును కేంద్రం కూడా ప్రశం సించింది. కేరళ తదితర రాష్ట్రాలు ఈ మోడల్‌ను అధ్యయనం చేశాయి. ఢిల్లీలో జరిగిన జమాతే సమావేశా లకు 13,702 మంది హాజరయ్యారని కేంద్రా నికి లెక్క చెప్పింది ఏపీ ప్రభుత్వమే. ఈ సంగతి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించుకోలేదు. ఢిల్లీ సమాచారంతో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక రాసింది. మొబైల్‌ టవర్‌ డంప్‌ విశ్లేషణతో ఏపీ నిఘా విభాగం ఈ లెక్కను తేల్చిందట. రాష్ట్ర ప్రభుత్వాధినేతకు పబ్లిసిటీ వ్యామోహం లేకపో వడం, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్ల ఆసక్తి లేకపోవడంతో ప్రతి పక్షం దాన్ని అవకాశంగా తీసుకొని అవాస్తవాలను ప్రచా రంలో పెట్టడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నది. లాక్‌ డౌన్‌ ప్రకటించిన మరుసటి రోజు జరిగిన సంఘటన కూడా ఆందోళన కలిగిస్తున్నది.

హైదరాబాద్‌లో ఉద్యోగులకు, విద్యార్థులకు ప్రైవేట్‌ హాస్టళ్లు నడుపుతున్న నిర్వాహకుల్లో ‘కొంతమంది’ చొరవ తీసుకొని మిగిలిన వారిని కూడా ఒప్పించి ఒక్కసారిగా హాస్టళ్లను మూసివేసి వేలాది మందిని బయటకు పంపారు. కొందరు ఉన్నతస్థాయి ‘పెద్దల’ ప్రోద్బలంతో వాళ్లందరికీ రాష్ట్రం దాటడానికి పాస్‌లు కూడా లభిం చాయి. వేలమంది ఏపీ సరిహద్దుల్లోకి వచ్చి చేరారు. వారిలో కొందరు ప్రభుత్వానికి వ్యతి రేకంగా రాజకీయ ప్రసంగాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టంగా వ్యవహరించి క్వారంటైన్‌లో ఉండేందుకు అంగీకరించిన వారినే లోనికి అనుమతించడంతో పెద్ద ముప్పు తప్పింది. ఇదంతా ఒక రాజకీయ వ్యూహం ప్రకా రమే జరిగిందనడానికి అన్ని ఆధారాలూ ఉన్నాయి. రాజకీ యాల్లో ఇంతకన్న దిగజారుడుతనం ఉండదు. ఇది రాజకీయాలనూ, విభేదాలనూ పక్కన పెట్టాల్సిన సమయం. ఆ సంఘీభావాన్ని చాటేందుకు ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకు దీపాలను వెలిగిద్దాం. ప్రధాని పిలుపుకు మద్దతు పలుకుదాం. క్యాండిళ్లు, దీపాలు లేని ఇళ్లు ఉండవచ్చుగానీ, సెల్‌ఫోన్‌ లేని ఇల్లు ఉండదు కదా. ఆ ఫ్లాష్‌ చాలు.


వర్ధెల్లి మురళి 
muralivardelli@yahoo.co.in

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top