మహిళా మంత్రికి చేదు అనుభవం

MP Minister Failed To Read Republic Day Speech - Sakshi

మహిళా మంత్రిపై నెటిజన్ల కామెంట్లు

భోపాల్‌ : ‘మిగిలినవి.. కలెక్టర్‌ గారు చదువుతారు. నాకు రెండు రోజులుగా ఆరోగ్యం బాగాలేదు. కావాలంటే మా డాక్టర్‌ని అడగండి. మరేం పర్లేదు. నాకు బదులుగా కలెక్టర్‌ ప్రసంగాన్ని పూర్తి చేస్తారు’  అని వ్యాఖ్యానించిన మహిళా మంత్రి ఇమర్తీ దేవిపై నెటిజన్లు వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. ‘నిజంగా ఆరోగ్యం బాగాలేకపోతే కార్యక్రమానికి ఎందుకు హాజరు అయ్యారు. అయినా చదవడం రాకపోతే హుందాగా తప్పుకొని ఉండాల్సింది. చిన్నపిల్లల్లా ఇలా సాకులు చెప్పడం దేనికి మేడమ్‌’  అంటూ విమర్శిస్తున్నారు.

ఇంతకీ విషయమేమిటంటే.. మధ్యప్రదేశ్‌ స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి ఇమర్తీ దేవి గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్వాలియర్‌లో జెండా ఎగురవేశారు. అనంతరం ఉపన్యాసం ఇచ్చేందుకు ఉపక్రమించారు. పేపర్‌పై రాసుకున్న అక్షరాలను చదివే క్రమంలో ఆమె తడబడ్డారు. వెంటనే పక్కనే ఉన్న కలెక్టర్‌ భరత్‌ యాదవ్‌కు తన బాధ్యతను అప్పగించారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇక.. పదిహేనేళ్ల తర్వాత మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డిసెంబరు 25న మంత్రివర్గ విస్తరణ చేపట్టిన ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌.. ఇద్దరు మహిళలు విజయలక్ష్మీ సాధూ, ఇమర్తీ దేవీలకు మంత్రులుగా అవకాశం కల్పించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top