మోదీ ఐడియా జీవితాన్నే మార్చేసింది

Modi Pakoda Idea Change A Congressman Life - Sakshi

గాంధీనగర్‌, గుజరాత్‌ : ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది ఒక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘పకోడాలు (పకోడీలు) అమ్ముకోవడం కూడా ఉద్యోగమే’ అన్న సంగతి తెలిసిందే. అయితే మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా విమర్శించింది. కానీ నేడు మోదీ ఇచ్చిన ‘పకోడా ఐడియా’నే ఒక కాంగ్రెస్‌ కార్యకర్త జీవితాన్ని మార్చేసింది.

వడోదరకు చెందిన నారాయణభాయ్‌ రాజ్‌పుత్‌ హిందీ లిటరేచర్‌లో పోస్టు గ్రాడ్యూయేట్‌. కాంగ్రెస్‌ పార్టీకి వీరాభిమాని. ఎన్‌ఎస్‌యూఐలో కార్యకర్తగా చేరి కాంగ్రెస్‌ పార్టీ కోసం పనిచేస్తున్నాడు. అయితే పీజీ చేసిన నారాయణభాయ్‌ నిరుద్యోగి. మోదీ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూను అతడు కూడా చూశాడు. మోదీ చెప్పిన ‘పకోడా ఐడియా’ అతనికి బాగా నచ్చింది. పనిపాటా లేకుండా ఖాళీగా ఉండటం కంటే పకోడా బిజినెస్ చేయడం మంచిదని భావించాడు. తొలుత ఒక స్టాల్‌తో ప్రారంభమైన నారాయణభాయ్‌ పకోడా వ్యాపారం నేడు మొత్తం 35శాఖలుగా, వడోదర నగరమంతా విస్తరించింది.

ఈ విషయం గురించి నారాయణభాయ్‌ ‘ప్రధాని ‘పకోడా బిజినెస్‌ ఐడియా’ విన్న తర్వాత నేను ఎందుకు ఆ మార్గంలో వెళ్లకూడదు అనుకున్నాను. నిరుద్యోగిగా ఉండటం కంటే పకోడా అమ్మి రోజుకు కనీసం 200 రూపాయలు సంపాదించడం మంచిదే కదా అనిపించింది. అందుకే ఒకసారి ప్రయత్నించి చుద్దామని భావించాను. మొదట 10 కేజీల పదార్థాలతో, 100 గ్రాముల పకోడా ఒక్కొక్కటిగా 10 రూపాయలుగా ఒక స్టాల్‌ను ప్రారంభించాను.  నేడు నగరవ్యాప్తంగా నా పకోడా స్టాల్స్‌ 35 ఉన్నాయి. ప్రతిరోజు 500 - 600 కేజీల పకోడాలు అమ్ముతున్నాను’ అని తెలిపాడు.

వ్యాపారం ప్రారంభించిన రెండు నెలల్లోనే నారాయణభాయ్‌ ‘పకోడా బిజినెస్‌’కు మంచి పేరు వచ్చింది. నారాయణభాయ్‌ రోజు ఉదయం 7 - 11 గంటల వరకూ అలానే సాయంత్రం కూడా ఇదే సమయంలో పకోడాను అమ్ముతుంటాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top