
చర్ల/పర్ణశాల: ఛత్తీస్‌గఢ్‌లో తమ హెచ్చరికలను పట్టించుకోకుండా రోడ్డు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ హరిశంకర్ సాహూను మావోయిస్టులు హతమార్చారు. ఈ ఘటన సుక్మా జిల్లాలో గురువారం జరిగింది. దోర్నపాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇప్పనపల్లి గ్రామం దగ్గర మిస్మా–చిరోర్డ్‌గూడ రోడ్డు పనులను ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకం కింద చేపట్టారు. ఏడాది క్రితమే పనులు మొదలైనా మావోల హెచ్చరికలతో నిలిపివేశారు. కాగా, కాంట్రాక్టర్ ఆ రోడ్డు నిర్మాణ పనులను బుధవారం మళ్లీ ప్రారంభించారు. దీంతో గురువారం ఉదయం సాయుధులైన దాదాపు డజను మంది మావోయిస్టులు రోడ్డు నిర్మాణప్రాంతానికొచ్చి పనులు ఆపేయాలని అక్కడి కార్మికులను బెదిరించారు. అక్కడే ఉన్న హరిశంకర్‌ను తలపై పదునైన ఆయుధాలతో కొట్టి చంపారు. హరిశంకర్ ఎస్‌యూవీ వాహనం, మరో ఐదు వాహనాలను తగలబెట్టారు. రోడ్డు పనులకు వాడుతున్న ట్రక్కులు, రోడ్డు రోలర్లనూ దహనం చేశారు.