లొంగిపోయిన కేంద్రకమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాద్‌రావు అలియాస్ చంద్రన్న
అనారోగ్య సమస్యలతో వనం వీడి జనంలోకి
ముగిసిన 45ఏళ్ల ఉద్యమ ప్రస్థానం
బడిలో తండ్రి బోధించిన పాఠాల కన్నా కళాశాలలో స్నేహితుడి దగ్గర నేర్చుకున్న విప్లవ మాటలే అతడిని అడవిబాట పట్టించాయి. గ్రామాల్లో వడ్డీ వ్యాపారుల ఆగడాలు నశించాలని, పీడీత, బాధిత పక్షాల కోసం పోరాడాలని అనుకున్నాడు. అందుకు తుపాకీనే మార్గమని భావించారు. పోరాట పంథాతోనే సమసమాజం సాధ్యమనుకుని 45 ఏళ్లు అజ్ఞాతంలో గడిపారు. మారిన కాలమాన పరిస్థితులు, అనారోగ్య సమస్యలతో తన నిర్ణయాన్ని మార్చుకుని ఆయుధం వీడి జనంలో వచ్చారు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాద్‌రావు అలియాస్ చంద్రన్న, శంకరన్న, సోమన్న. సాయుధ పోరాటాల ద్వారా లక్ష్యాన్ని చేరుకోలేమని భావించి, ప్రజాస్వామ్య పద్ధతుల్లో వెళ్లాలని నిర్ణయించుకుని చంద్రన్న అస్త్రసన్యాసం చేయడం అటు మావోయిస్టు పార్టీలో, ఇటు ప్రజల్లోనూ చర్చకు దారి తీసింది.
సాక్షి, పెద్దపల్లి: సాయుధ పోరాటం ద్వారానే రాజ్యాధికారం సాధ్యమనే సిద్ధాంతాన్ని నమ్ముకుని పనిచేసిన మావోయిస్టులు ఆయుధం వీడి జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన కేంద్రకమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌రావు మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోగా, తాజాగా తెలంగాణ డీజీపీ వద్ద కేంద్రకమిటీ సభ్యుడు, తెలంగాణ కమిటీకి మార్గదర్శిగా వ్యవహరిస్తున్న పుల్లూరి ప్రసాద్‌రావు అలియాస్ చంద్రన్న లొంగిపోయాడు. ప్రాణభయంతో లొంగిపోయారా? అనారోగ్య సమస్యలతోనా.. పార్టీకి నమ్మకద్రోహం చేశారా? సాయుధ పోరాట పంథాకు కాలం చెల్లిందన్న అభిప్రాయంతో జనజీవన స్రవంతిలో కలిశారా అనేది చర్చనీయాంశంగా మారింది. మాజీ మావోయిస్టులు తదుపరి జీవితాన్ని ఎలా గడపబోతున్నారు?పునరావాస శిబిరాల్లో కాలం వెళ్లదీస్తారా? సొంత ఊళ్లకు, తమకు నచ్చిన ప్రదేశానికో వెళ్లి సాధారణ జీవనం గడుపుతారా? పాలక పార్టీలో చేరుతారా? ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటారా అనేక ప్రశ్నలు ప్రజాసంఘాల్లో వ్యక్తమవుతున్నాయి.
రణమా...శరణమా ?
జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలు మల్లోజుల వేణుగోపాల్, పుల్లూరి ప్రసాద్‌రావు లొంగిపోగా అడవిలో ఉన్న మిగితా నేతలు ఆయుధం వీడి లొంగిపోతారా? లేక పోరాట పంథాలోనే కొనసాగుతారా అనేది ఆసక్తిగా మారింది. జిల్లా నుంచి మల్లా రాజిరెడ్డి, అప్పాసి నారాయణ, గంగిడి సత్యనారాయణరెడ్డి, ఆలేటి రామలచ్చులు, దాతు ఐలయ్య, దీకొండ శంకరయ్య, కంకణాల రాజిరెడ్డి, జూవ్వడి వెంకటేశ్వర్‌రావు మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి 1 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని ప్రకటించింది. దీంతో విప్లవ పంథా కొనసాగుతుందా లేక ప్రజాపంథాలోకి మిగిలిన నేతలు వస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
కలిసి చదువుకున్నాం
పుల్లూరి ప్రసాదరావు నేను వడ్కాపూర్‌లోనే 5 వ తరగతి వరకు, 10వ తరగతి వరకు ధూళికట్టలో కలిసి చదువుకున్నం. అప్పట్లోనే గ్రామాల్లో వడ్డీ వ్యాపారుల ఆగడాలు నశించాలని పోరాడేవాడు. చాలా సౌమ్యుడు. ఎక్కువగా మాట్లాడక పోయేది. ఇంటర్ చదివేందుకు పెద్దపల్లికి వెళ్లి ఆప్పటి నుంచి ఇప్పటి వరకు కనబడలేదు.
– చెన్నమనేని సాగర్‌రావు, ప్రసాదరావు మిత్రుడు, వడ్కాపూర్


