
పోలీసుల తీరుపై నెటిజన్ల ఆగ్రహం
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని అలానే అరగంటపాటూ వదిలేసి అతని మరణానికి కారణమైన పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తిరువనంతపురం(కేరళ):
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని అలానే అరగంటపాటూ వదిలేసి అతని మరణానికి కారణమైన పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తిరువనంతపురంలోని ఈస్ట్ ఫోర్ట్ సమీపంలో ఆదివారం విక్రం సారాబాయ్ స్పేస్ సెంటర్కు చెందిన వాహనం ఓ వృద్ధున్ని ఢీకొట్టింది. అక్కడే ఉన్న పోలీసులు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వృద్ధున్ని అరగంట పాటూ ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించలేదు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న అతన్ని అలానే వదిలేసి అంబులెన్స్ వచ్చే వరకు పోలీసులు వేచి చూశారు. దీంతో తీవ్రరక్తస్రావం జరిగి ఆ వ్యక్తి మృతి చెందాడు. జరిగిన సంఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టడంతో పోలీసుల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.
అయితే ఆ వ్యక్తికి తీవ్రగాయాలవ్వడంతో స్ట్రెచర్ లేకుండా తీసుకు వెళ్లడం ఆ వ్యక్తి ప్రాణానికే ప్రమాదం అని భావించామని పోలీసులు చెబుతున్నారు. అందుకే అంబులెన్స్ వచ్చే వరకు ఆగాల్సి వచ్చిందన్నారు. అతని కాలు దాదాపు శరీరం నుంచి విడిపోయిందని అందుకే పోలీసు జీపులో తీసుకు వెళ్లలేకపోయామన్నారు. ఆయితే ఆ వృద్ధునికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. అతను కేరళకు చెందిన వ్యక్తి కాదని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం అతని మృతదేహాన్ని తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఉంచారు.