వీడియోకోసం గంగలో దూకాడు..

వీడియోకోసం గంగలో దూకాడు.. - Sakshi


సెల్ఫీలు, వీడియోల పిచ్చి మరోప్రాణాన్ని బలిగొంది. ప్రతి విషయాన్నీ తమ స్మార్ట్ ఫోన్, కెమెరాల్లో బంధించాలన్న వేలం వెర్రితో తాజాగా గంగానదిలో దూకుతూ స్నేహితులతో వీడియో తీయించుకున్నఓ వ్యక్తి.. ఏకంగా కనిపించకుండానే పోవడం ఆందోళన కలిగించింది. ప్రతి విషయాన్ని రికార్డు చేసి, సోషల్ మీడియాలో షేర్ చేయాలనుకుంటున్న నేపథ్యంలో జరిగిన ఘటన వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంది.హరిద్వార్ కు దగ్గరలోని గంగానదిలో దూకిన వ్యక్తి కనిపించకుండా పోవడం కలకలం రేపింది. స్నేహితుడి వీడియోను  తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేయాలన్న తపనే తప్పించి, అతడేమయ్యాడో పట్టించుకునే పరిస్థితి వారిలో కనిపించకపోవడం ఆందోళన నింపుతోంది. బాగా మద్యం సేవించిన 27 ఏళ్ళ  వ్యక్తి గంగా నదిలో దూకుతూ వీడియో తీయించుకోడానికి ముందుగా కాస్త ఆలోచించినా.. తర్వాత స్నేహితుల ప్రోత్సాహంతో అనుకున్నంతపనీ చేశాడు. ఈతకొట్టుకుంటూ తిరిగి బయటకు వద్దామనుకొని గంగానదిలో దూకిన వ్యక్తి , నీటిలో మునిగి కనిపించకుండా పోయాడు. స్నేహితులు తీసిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.భద్రాబాద్ గాంధ్ మిర్పూర్ కు చెందిన 27 ఏళ్ళ ఆశిష్ చౌహాన్ గంగ్ నహర్ లోని గంగా నదిలో మునిగిపోయి 48 గంటలు దాటినా బాడీ దొరకలేదు. తన స్నేహితులు అశ్విని చౌహాన్, బాలరాజ్ కుమార్ లతో కలసి ఎప్పట్లాగే గంగా నది ప్రాంతానికి వెళ్ళిన ముగ్గురూ అక్కడి గట్టుపై కూర్చున్నారు. ముందు బాగానే ఉన్నా ఆ స్నేహితులంతా కలసి మద్యం సేవించిన అనంతరం చౌహాన్ నదిలో దూకి ఈత కొట్టాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు ఆ దృశ్యాన్ని రికార్డు చేయాలని ఆదేశించాడు. ముందు కొంత ఆలోచించినా.. చౌహాన్ చివరికి నదిలో దూకడానికి సిద్ధమయ్యాడు. స్నేహితులు వీడియో తీస్తూ ఉండిపోయారు. అయితే దూకిన వ్యక్తి ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో ఆందోళనలో పడ్డారు. అతడి జాడ తెలుసుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో వారిద్దరూ దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు, సహాయక సిబ్బందితో సహా నదిలో గాలించినా ఫలితం కనిపించకపోవడంతో చౌహాన్ స్నేహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తామంతా కలసి ఎన్నోసార్లు గంగానదిలో ఈత కొడుతుంటామని, చౌహాన్ మంచి ఈతగాడని చెప్తున్నారు. చౌహాన్ నదిలో దూకే సమయంలో స్నేహితులు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా... కొన్ని టీవీ ఛానెల్స్ కూడ ప్రసారం చేశాయి.నీటి ప్రవాహంలో చౌహాన్ శరీరం కొట్టుకుపోయి ఉండొచ్చని అది ఎక్కడో ఓచోట బయటకు వస్తుందని భద్రాబాద్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ అమర్ చంద్ర శర్మ తెలిపారు. చౌహాన్ కుటుంబ సభ్యులు ఈ ఘటనపై ఎటువంటి కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదని, విషయంపై చౌహాన్ కుటుంబానికి సమాచారం అందించగా.. ఎవ్వరిపైనా అనుమానం వ్యక్తం చేయడం గాని, ఆరోపించడం గాని చేయలేదని తెలిపారు. ఇది ప్రమాద వశాత్తు జరిగిన ఘటనగానే కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లు పోలీస్ అధికారులు వివరించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top