దారి తప్పిన దీదీ హెలికాఫ్టర్‌

Mamata Banerjee Helicopter Loses Its Way - Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ దారితప్పడం పార్టీ శ్రేణుల్లో, అధికారుల్లో కలవరానికి కారణమయింది. బుధవారం ఉత్తర దీనాజ్‌పూర్‌ జిల్లా చోప్రా జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం కోసం మమతా బెనర్జీ.. మధ్యాహ్నం 1.05 గంటలకు సిలిగురి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరారు. అయితే షెడ్యూల్‌ ప్రకారం 1.27 గంటలకు ఆమె అక్కడికి చేరుకోవాల్సి ఉంది. అయితే సమయం దాటినా కూడా మమత ప్రయాణిస్తున్న చాపర్‌ అక్కడికి రావకపోవడంతో జిల్లా అధికారులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే మమత ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ పైలట్‌ సభాస్థలిని గుర్తించకపోవడంతో.. వారు బిహార్‌లోకి ప్రవేశించారు. 

వెంటనే పైలట్‌తో సంప్రదింపులు జరిపిన అధికారులు హెలికాఫ్టర్‌ సభాస్థలికి చేరుకునేలా డైరక్షన్స్‌ ఇచ్చారు. ఫైలట్‌ సభాస్థలిని గుర్తుపట్టేలా స్మోక్డ్‌ గన్స్‌ సాయంతో రంగుల పొగలను వదిలారు. దీంతో మమత ప్రయాణిస్తున్న చాపర్‌ 2 గంటల సమయంలో హెలిప్యాడ్‌ వద్ద క్షేమంగా ల్యాండ్‌ అయింది. ఆ తర్వాత చోప్రా సభలో ప్రసంగించిన మమత మాట్లాడుతూ.. సభకు సమయానికి రాలేకపోయినందుకు క్షమాపణలు కోరారు. ఫైలట్‌ హెలికాఫ్టర్‌ దిగే స్థలాన్ని గుర్తించకపోవడం వల్ల ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలిపారు. 

అయితే జెడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న మమత ప్రయాణిస్తున్న చాపర్‌ దారితప్పడం కాసేపు అధికార యంత్రాగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. సభ జరుగుతున్న ప్రాంతం బంగ్లాదేశ్‌ సరిహద్దులకు దగ్గరగా ఉండటం కూడా వారిని ఉలిక్కిపడేలా చేసింది. కాగా, ఈ ఘటనపై విచారణ చేపట్టడానికి ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు న్యూస్‌-18 ఓ కథనాన్ని ప్రచురించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top