మాలెగావ్‌ కేసులో పురోహిత్‌కు బెయిల్‌ | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు ప్రసాద్‌ పురోహిత్‌కు బెయిల్‌

Published Mon, Aug 21 2017 11:03 AM

మాలెగావ్‌ కేసులో పురోహిత్‌కు బెయిల్‌ - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మాలెగావ్‌ పేలుడు కేసులో ఎట్టకేలకు లెఫ్టినెంట్‌ కల్నల్‌ ప్రసాద్‌ శ్రీకాంత్‌ పురోహిత్‌కు సుప్రీం కోర్టు సోమవారం బెయిల్‌ మంజూరు చేసింది. తన బెయిల్‌ వినతిని తోసిపుచ్చుతూ బొంబాయి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఆయన సుప్రీంను ఆశ్రయించారు. పురోహిత్‌కు బెయిల్‌ మంజూరు చేస్తూ జస్టిస​ ఆర్‌కే అగర్వాల్‌, ఏఎం సప్రేతో కూడిన బెంచ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ సందర్భంగా పురోహిత్‌ తరపున సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే వాదనలు వినిపిస్తూ నిందితుడు తొమ్మిదేళ్లుగా జైలులోనే ఉన్నా ఇప్పటివరకూ ఆయనపై అభియోగాలు నమోదు చేయలేదని చెప్పారు.

పురోహిత్‌పై మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం కింద మోపిన అభియోగాలను వెనక్కి తీసుకున్నందున మధ్యంతర బెయిల్‌ పొందేందుకు అర్హుడని కోర్టుకు నివేదించారు. ఎన్‌ఐఏ తరపున అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ మణిందర్‌ సింగ్‌ వాదిస్తూ పురోహిత్‌పై అభియోగాల నమోదుకు అవసరమైన ఆధారాలున్నాయని చెప్పారు.

మాలెగావ్‌లో 2008 సెప్టెంబర్‌ 29న జరిగిన బాంబు పేలుళ్లలో ఏడుగురు మరణించారు. అక్కడ పెద్దసంఖ్యలో ముస్లింలున్నందునే పేలుళ్లకు లక్ష్యంగా చేసుకున్నారని 4000 పేజీల చార్జిషీట్‌లో పేర్కొన్నారు. పేలుళ్లకు ప్రగ్యా ఠాకూర్‌, పురోహిత్‌, సహ నిందితుడు దయానంద్‌ పాండేలు ప్రధాన కుట్రదారులుగా చార్జిషీట్‌ పొందుపరిచారు.

Advertisement
Advertisement