1.5లక్షల విలువైన మంగళసూత్రాన్ని మింగిన ఎద్దు

In Maharashtra Bull Swallows Gold Mangalsutra - Sakshi

ముంబై: ఓ ఎద్దు మహిళ మంగళసూత్రాన్ని మింగేసిన వింత సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. వివరాలు.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ప్రతి ఏటా ఆగస్టులో ‘బెయిల్‌ పోలా’(ఎద్దుల పండుగ) పేరుతో ఓ పండుగ జరుగుతుంది. మన దగ్గర కనుమ నాడు ఏ విధంగానైతే ఎద్దులను అలంకరించి, పూజలు నిర్వహిస్తామో.. అలానే ఈ రాష్ట్రాల్లో కూడా బెయిల్‌ పోలా పేరుతో వేడుక నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎద్దులను అలంకరించి.. వాటికి పూజలు చేసి.. ప్రత్యేకంగా చేసిన ప్రసాదం తినిపిస్తారు. అంతేకాక బంగారు ఆభరాణాన్ని ఎద్దు నుదురుకు తాకిస్తే మంచిదని నమ్ముతారు. ఈ క్రమంలో గత నెల 30న మహారాష్ట్రలోఈ బెయిల్‌ పోలా వేడుక నిర్వహించారు.

ఈ సందర్భంగా పండుగ రోజు సాయంత్రం ఓ రైతు తన ఎద్దులను అందంగా అలంకరించి పూజ నిమిత్తం ఇంటికి తీసుకువచ్చాడు. అతని భార్య ఓ పళ్లెంలో హరతి, ప్రసాదంతో పాటు తన బంగారు మంగళసూత్రాన్ని కూడా తీసుకుని వచ్చింది. ముందు ఎడ్లకు బొట్టు పెట్టి హారతి ఇచ్చింది. మంగళసూత్రాన్ని ఎద్దుల నుదురుకు తాకించి.. ప్రసాదం పెడదామని అనుకుంటుండగా ఉన్నట్టుండి కరెంట్‌ పోయింది. దాంతో లోపలికి వెళ్లి క్యాండిల్‌ తీసుకుని వచ్చి చూడగా.. ప్లేట్‌లో ఉంచిన ప్రసాదంతో పాటు.. బంగారు మంగళసూత్రం కూడా కనిపించలేదు. ఓ ఎద్దు ప్రసాదం తినడం కనిపించింది. కంగారుపడ్డ దంపతులు ఆ చుట్టుపక్కల అంతా వెతికారు. కానీ మంగళసూత్రం మాత్రం కనిపించలేదు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు ఎద్దు ప్రసాదంతో పాటు మంగళసూత్రాన్ని కూడా మింగేసి ఉంటుందని చెప్పారు. పేడతో పాటు వస్తుందని సూచించారు.

దాంతో ఆ దంపతులు ఓ వారం రోజుల పాటు ఆ ఎద్దు పేడను జాగ్రత్తగా దాచి ఉంచారు. కానీ లాభం లేకపోవడంతో చివరకు వెటర్నరీ ఆస్పత్రికి తీసుకెళ్లి జరిగిన విషయం చెప్పారు. దాంతో వైద్యులు ఎద్దుకు స్కాన్‌ చేయగా.. దాని కడుపులో మంగళసూత్రం కనిపించింది. ఈ క్రమంలో ఈ నెల 8న ఎద్దుకు ఆపరేషన్‌ చేసి దాని కడుపులో నుంచి మంగళసూత్రాన్ని బయటకు తీశారు. 40గ్రాముల బరువున్న ఈ మంగళసూత్రం ఖరీదు రూ.1.5లక్షలుంటుందని సదరు రైతు తెలిపాడు. ప్రస్తుతం ఎద్దు ఆరోగ్యం బాగానే ఉందని.. నెల రోజుల పాటు విశ్రాంతి ఇవ్వాల్సిందిగా వైద్యులు సూచించారని పేర్కొన్నాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top