కానిస్టేబుల్‌పై ఉన్నత స్థాయి విచారణకు సీఎం ఆదేశాలు

Madhya Pradesh cm Shivraj ordered enquiry on Kamal Nath security scare - Sakshi

సాక్షి, భోపాల్: కేంద్ర మాజీ మంత్రి, లోక్‌సభ ఎంపీ కమల్‌నాథ్‌కు ఓ కానిస్టేబుల్‌ తన సర్వీస్‌ రైఫిల్‌ను గురిపెట్టిన ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఎంక్వైరీ ఆదేశించారు. ఉన్నతస్థాయిలో విచారణ చేపట్టి అసలు ఏం జరిగిందో నివేదిక అందించాలన్నారు. కేంద్ర మాజీ మంత్రిపై రైఫిల్ గురిపెట్టడంపై విచారణ చేపట్టి, నిందితుడిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఈ నెల 15న కాంగ్రెస్ ఎంపీ కమల్‌నాథ్‌ చార్టెడ్‌ విమానంలో ఢిల్లీకి బయలుదేరేందుకు ఛిన్‌ద్వారాలోని విమానాశ్రయానికి వచ్చారు. ఈ సమయంలో మధ్యప్రదేశ్‌కు చెందిన రత్నేష్‌ పవార్‌ అనే కానిస్టేబుల్‌ అత్యుత్సాహం ప్రదర్శించాడు. కమల్‌నాథ్‌ విమానం ఎక్కుతుండగా పవార్‌ తన సర్వీస్‌ రైఫిల్‌ను ఆయన వైపు గురిపెట్టడం కలకలం రేపింది. ఎంపీకి రైఫిల్ గురిపెట్టడంతో అప్రమత్తమైన కమల్‌నాథ్ భద్రతా సిబ్బంది ఆ కానిస్టేబుల్‌ను అడ్డుకొని పక్కకు జరిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన అడ్వకేట్ వివేక్ టంకా ట్విట్టర్‌లో కమల్‌నాథ్‌కు కానిస్టేబుల్ రైఫిల్ గురిపెట్టడాన్ని తీవ్రంగా ఖండించడంతో విషయం వెలుగుచూసింది.

ఛిన్‌ద్వారా లోక్‌సభ స్థానం నుంచి ఇప్పటివరకు 9 సార్లు ఎంపీగా గెలుపొందిన నేత కమల్‌నాథ్‌కు ఆయుధాన్ని గురిపెట్టడంపై ఏఎస్పీ నీరజ్‌ సోనీ విచారణకు ఆదేశించారు. అయితే కాంగ్రెస్ నుంచి తీవ్ర విమర్శలు వస్తుండటంతో నేరుగా సీఎం శివరాజ్ రంగంలోకి ఉన్నతస్థాయిలో విచారణ చేయాలని సంకేతాలిచ్చారు. కానిస్టేబుల్ తప్పిదమని విచారణలో తేలితే చర్యలు తీసుకోవాలని పోలీసుశాఖకు సూచించారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top