కాంగ్రెస్, ఎన్సీపీల ఎన్నికల ప్రణాళికలు పాత సీసాలో పాత సారాయి లాగా ఉన్నాయని బీజేపీ ఎద్దేవా చేసింది. గతంలో చేసిన ఏ వాగ్దానాలనూ ఆ రెండు పార్టీలు నెరవేర్చలేదని బీజేపీ ప్రతినిధి మాధవ్ భండారీ విమర్శించారు.
ముంబై: కాంగ్రెస్, ఎన్సీపీల ఎన్నికల ప్రణాళికలు పాత సీసాలో పాత సారాయి లాగా ఉన్నాయని బీజేపీ ఎద్దేవా చేసింది. గతంలో చేసిన ఏ వాగ్దానాలనూ ఆ రెండు పార్టీలు నెరవేర్చలేదని బీజేపీ ప్రతినిధి మాధవ్ భండారీ విమర్శించారు. డిసెంబర్ 2012 నాటికే రాష్ట్రంలో విద్యుత్ సమస్య లేకుండా చేస్తామని ఎన్సీపీ హామీ ఇచ్చిందని చెప్పారు. దహేజ్, ఉరాన్ మధ్య గ్యాస్ పైప్‌లైన్ కోసం ఎటువంటి ప్రయత్నాలూ జరగలేదని అన్నారు.
శరద్ పవార్ కేంద్ర వ్యవసాయ మంత్రిగా ఉన్న కాలంలో 60వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని భండారీ విమర్శించారు. ఉచిత విద్యుత్ అందచేస్తామన్న హామీతో కాంగ్రెస్, ఎన్సీపీలు 2004 ఎన్నికల్లో గెలుపొందారని, తిరిగి ఈసారి కూడా అవే హామీలు ఇస్తున్నారని అన్నారు. వారి మేనిఫెస్టోల్లో కొత్త అంశాలేవీ కనిపించడం లేదని అన్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రాంతీయ అసమానతలను తొలగిస్తామని చెప్పారు. చిన్న రాష్ట్రాలకు తాము అనుకూలమని అన్నారు.