ఛత్తీస్ గఢ్ లో స్వలింగ సంపర్కులకు సంకటం ఎదురవుతోంది.
ఛత్తీస్ గఢ్ లో స్వలింగ సంపర్కులకు సంకటం ఎదురవుతోంది. గత రెండు నెలల్లో ముగ్గురు స్వలింగ సంపర్కులు ఒత్తిడులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా కాంకేర్ జిల్లా లోని పాక్నజుర్ లో ఒక 22 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆ స్వలింగ సంపర్క భాగస్వామిగా ఉన్న మైనర్ బాలిక కూడా ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
యువతికి కొద్ది నెలల క్రితం మైనర్ బాలికతో సంబంధం ఏర్పడింది. వారిద్దరూ కలసి జీవించడం ప్రారంభించారు. ఇటీవల ఆ యువతి మైనర్ బాలికను తన ఇంట్లోకి నేరుగా తీసుకురావడంతో సమస్య మొదలైంది. ఇరు పక్షాల తల్లిదండ్రులు దీన్ని గట్టిగా వ్యతిరేకించారు. మైనర్ బాలిక తల్లిదండ్రులు పోలీసుల సాయంతో తమ కూతురిని వెంట తీసుకుని వెళ్లారు.
దీంతో యువతి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంగతి తెలిసిన మైనర్ బాలిక విషం తాగింది. ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.