ఇస్తారా.. లాక్కోవాలా..! | Land hurdle eases for Navi Mumbai airport | Sakshi
Sakshi News home page

ఇస్తారా.. లాక్కోవాలా..!

Sep 23 2014 10:14 PM | Updated on Apr 3 2019 8:42 PM

ప్రతిపాదిత నవీముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు గ్రామస్తులకు ఇచ్చిన గడువు ఈ నెల 30తో ముగుస్తుంది.

సాక్షి, ముంబై: ప్రతిపాదిత నవీముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు గ్రామస్తులకు ఇచ్చిన గడువు ఈ నెల 30తో ముగుస్తుంది. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన భూసేకరణ చట్టం ప్రకారం ఆ స్థలాన్ని గ్రామస్తుల నుంచి బలవంతంగా తీసుకోనున్నారు. ఇలా బలవంతంగా భూసేకరణ జరిగితే బాధితులకు సిటీ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (సిడ్కో) ద్వారా లభించే పునరావాస ప్యాకేజీ వర్తించదని అధికారులు స్పష్టం చేశారు.

దీంతో తాడో, పేడో తేల్చుకునేందుకు గ్రామస్తుల వద్ద కేవలం వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రతిపాదిత అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి మొత్తం 2,268 ఎకరాల స్థలం అవసరముంది. అందులో  సిడ్కో వద్ద 1,572 ఎకరాల స్థలం ఉంది. మిగత 696 ఎక్టార్ల స్థలాన్ని ఆ పరిసర ప్రాంతంలో ఉన్న 22 గ్రామాల నుంచి సేకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందులో కొన్ని గ్రామాలు, పల్లె ప్రజలకు సిడ్కో పరిపాలన విభాగం పునరావాసం కల్పించడంతోపాటు ప్యాకేజీలు, నష్ట పరిహారం అందజేసింది. దీంతో వారు గ్రామాలను ఖాళీచేసి వెళ్లిపోయారు.

కాని సిడ్కో అందజేసిన ప్యాకేజీలు, నష్టపరిహారం గిట్టుబాటుకాకపోవడంతో ఇప్పటికీ కొన్ని గ్రామాల ప్రజలు అక్కడే ఉన్నారు. దీంతో నిర్మాణ పనులు చేపట్టేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చివరకు సిడ్కో ఈ నెల 30 లోపు గ్రామాలను ఖాళీ చేయాలని రెండు నెలల కిందటే గడువు ఇచ్చింది. లేదంటే నియమాల ప్రకారం బలవంతంగా ఖాళీ చేయించాల్సి ఉంటుందని హెచ్చరించింది. అయినప్పటికీ గ్రామ ప్రజలు జంకడం లేదు. సమయం దగ్గరపడుతున్న కొద్దీ మరింత ఉత్కంఠ రేపుతోంది. కొందరు స్థానిక ప్రజా ప్రతినిధులు మధ్యవర్తిత్వం వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ బలవంతంగా ఖాళీ చేయిస్తే ప్రభుత్వం ద్వారా పొందే ప్యాకేజీలను నష్టపోవల్సి వస్తుందని వారికి నచ్చజెప్పే ప్రయత్నాలు ప్రారంభించారు. అందుకు గ్రామస్తులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement