కూలీల సంపాదన 30 వేలు! | Labor income of 30 thousand! | Sakshi
Sakshi News home page

కూలీల సంపాదన 30 వేలు!

May 24 2014 12:51 AM | Updated on Jun 4 2019 5:04 PM

కూలీల సంపాదన 30 వేలు! - Sakshi

కూలీల సంపాదన 30 వేలు!

వ్యవసాయ కూలీలు నెలంతా కష్టపడినా మహాఅయితే రూ. 10 వేలు సంపాదిస్తారు. రోజుకు రూ. 200 నుంచి రూ. 300 లభిస్తుంది. అందులోనూ మహిళా కూలీలకు ఇంకా తక్కువే లభిస్తుంది.

కేరళ ప్రభుత్వ పథకంతో లబ్ధి పొందుతున్న వ్యవసాయ కూలీలు
 
తిరువనంతపురం: వ్యవసాయ కూలీలు నెలంతా కష్టపడినా మహాఅయితే రూ. 10 వేలు సంపాదిస్తారు. రోజుకు రూ. 200 నుంచి రూ. 300 లభిస్తుంది. అందులోనూ మహిళా కూలీలకు ఇంకా తక్కువే లభిస్తుంది. కానీ నెలకు రూ. 30 వేల వరకు సంపాదించే వ్యవసాయ కూలీలను చూడాలనుకుంటున్నారా? నెలనెలా ఉద్యోగుల్లా.. ఠంచనుగా బ్యాంకు అకౌంట్ల ద్వారా వేతనాలనందుకుంటున్న కూలీలను చూడాలనుకుంటే.. విదేశాలకు వెళ్లనక్కరలేదు. మనదేశంలో.. అదీ మన పక్కనే ఉన్న కేరళలోనే ఆ అద్భుతం జరుగుతోంది.
 కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక పథకం కారణంగా అది సాధ్యమైంది. ఆ పథకం కింద ప్రతీ గ్రామ పంచాయితీలో ‘కర్షక కర్మ సేన’(వ్యవసాయ కూలీల సైన్యం)ను ఏర్పాటు చేస్తారు. స్థానిక వ్యవసాయ కూలీలు అందులో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. వారికి భూమి దున్నడం, నాట్లు వెయ్యడం, కొబ్బరికాయలు తెంచడం నుంచి ఆధునిక వ్యవసాయ పద్ధతుల వరకు అన్ని వ్యవసాయ సంబంధ పనుల్లో శిక్షణ ఇస్తారు. ఆ గ్రామంలో కూలీలు అవసరమైన వారు ఈ సేనను సంప్రదించి సేవలు పొందవచ్చు.

వారికివ్వాల్సిన కూలీలో బేరాలుండవు. పనిని బట్టి ముందే నిర్ణయించిన మొత్తాన్ని చెల్లించాల్సిందే. సాధారణంగా ఏ రోజు కూలీ మొత్తం ఆ రోజే చెల్లించే విధానం కూడా అక్కడ లేదు. చేసిన పనిని గంటలవారీగా లెక్కించి, సంపాదించిన మొత్తాన్ని నెలవారీగా ఆ కూలీల బ్యాంకు అకౌంట్లలో జమచేస్తారు. మహిళలకు కూడా పురుషులకు సమానంగా చెల్లిస్తారు. ఈ పథకం ద్వారా చాలామంది వ్యవసాయ కార్మికులు నెలకు రూ. 30 వేల వరకు సంపాదిస్తున్నారు. అయిదంకెల సంపాదన అక్కడ చాలా సాధారణం.గ్రామ పంచాయతీవారు కానీ, స్థానిక కృషి భవన్ అధికారులు కానీ కూలీల సేవలు పొందిన యజమానుల నుంచి డబ్బును వసూలు చేస్తారని, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 60 గ్రామాల్లో ఈ పథకాన్ని ప్రారంభించామని వ్యవసాయ శాఖ డెరైక్టర్ అజిత్ కుమార్ తెలిపారు. తొలిదశలో కనీసం 200 గ్రామాల్లో దీన్ని ప్రారంభించాలనుకుంటున్నామన్నారు. సంవత్సరం మొత్తం వారికి పని లభించేలా కూడా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement