
ప్లాస్టిక్ బ్యాగ్ మృతదేహంపై సీఎం స్పందన..
ప్లాస్టిక్ బ్యాగ్ లో మృతదేహం తరలింపు ఘటనపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందించారు. సమగ్రంగా సమీక్షించాలని ఆరోగ్య శాఖను ఆదేశించారు.
పాట్నాః ప్లాస్టిక్ బ్యాగ్ లో మృతదేహం తరలింపు ఘటనపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందించారు. పోస్ట్ మార్టం నిర్వహించిన ఓ శవాన్ని ఆస్పత్రి వర్గాలు అంబులెన్స్ ఇవ్వని కారణంతో కుటుంబ సభ్యులు ప్లాస్టిక్ బ్యాగ్ లో తరలించడంపై సమగ్రంగా సమీక్షించాలని ఆరోగ్య శాఖను ఆదేశించారు.
సింటూ కుమార్ అనే వ్యక్తి సుమారు రెండు వారాల క్రితం ప్రమాదవశాత్తు గంగానదిలో పడి మృతి చెందాడు. 25వ తేదీన అతని మృత దేహం బయట పడటంతో వెలికి తీయించిన పోలీస్ అధికారులు పోస్టు మార్టం నిమిత్తం కతియార్ కు తరలించారు. అయితే శరీరం అప్పటికే బాగా కుళ్ళుపోవడంతో అక్కడి వైద్యులు పోస్టుమార్టానికి స్వీకరించలేదు. దీనికి తోడు అంబులెన్స్ కూడా ఇచ్చేందుకు అనుమతించలేదు. దీంతో కాతియార్ నుంచి 86 కిలోమీటర్ల దూరంలో ఉన్న భాగల్పూర్ ఆసుపత్రికి బంధువులు శవాన్ని ప్లాస్టిక్ బ్యాగ్ లో చుట్టి తీసుకెళ్ళారు. విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న ముఖ్యమంత్రి ఘటనపై ఆరా తీశారు. విషయంపై లోతుగా పరిశీలించాలంటూ రాష్ట్ర ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా చూడాలంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే ప్రతిజిల్లాలో పోస్టుమార్టం కేంద్రాల నిర్మాణం కోసం ప్రణాళికలు మంజూరు చేశామని పనులు కొనసాగుతున్నట్లు సీఎం వెల్లడించారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా మెజిస్ట్రేట్ లల్లన్ జీ.. డీడీసీ, ఎస్డీవో, ఎస్డీపీవో లతో కూడిన ముగ్గురు సభ్యుల దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. రేపటికల్లా దర్యాప్తు బృందం నివేదికను సమర్పించాలని కోరినట్లు డీఎం తెలిపారు. సమగ్ర పరిశీలన నివేదికల ఆధారంగా అవసరమైన చర్యలు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.