కిడ్నీ బాధిత భారతం

Kidney Disease Victims Increase In India - Sakshi

కిడ్నీ వ్యాధికి దేశంలో ఏటా లక్ష మంది బలి

ప్రస్తుతం కోటి మంది కిడ్నీ వ్యాధి బాధితులు

దక్షిణాదిన అధికంగా నమోదవుతున్నట్లు నిర్ధారణ

70 ఏళ్లలోపు మృతుల్లో 3% మంది కిడ్నీ వ్యాధి వల్లే

నెలకు రూ.20 వేలలోపు ఆదాయం ఉన్నవారిలోనే 87 శాతం రోగులు

కోటి మంది రోగులకు 2 వేల మందే నెఫ్రాలజిస్టులు

ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐసీఎంఆర్‌ అధ్యయనంలో వెల్లడి  

అల్పాదాయులే అధికం.. 

ఆయా సంస్థలు దేశంలో 52,273 మంది వ్యాధిగ్రస్తులను సర్వే చేశాయి. ప్రాంతం, సామాజిక ఆర్థిక స్థాయిల వారీగా అధ్యయనం చేశాయి. అందులో తూర్పు భారతం నుంచి 5,768 మంది వ్యాధికి గురికాగా, ఉత్తర భారతం నుంచి 14,588 మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఇక ఈశాన్య భారతం నుంచి 13,362 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు. అయితే అత్యధికంగా దేశంలో దక్షిణ భారతం నుంచే 18,555 మంది మూత్రపిండాల వ్యాధికి గురయ్యారు. దక్షిణాది నుంచి వ్యాధికి గురైన వారిలో నెలకు రూ.5 వేలలోపు ఆదాయం ఉన్నవారు ఏకంగా 44.3% ఉండటం గమనార్హం. అలాగే రూ.20 వేలలోపు ఆదాయం గల 42.9% మందికి కిడ్నీ వ్యాధి సోకింది. మిగిలిన 12.7% మంది నెలకు రూ.20 వేలకు పైగా ఆదాయం గల వారున్నారని నివేదిక తెలిపింది. ఇక దక్షిణాదిలోనే షుగర్‌ కారణంగా కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నవారు 32.9 శాతమున్నారు. బీపీ ద్వారా కిడ్నీ వ్యాధి బారిన పడినవారు 11.8% మంది ఉన్నారు.  

2040 నాటికి నాలుగో స్థానం 
2016 లెక్కల ప్రకారం దేశంలో అత్యధికంగా గుండె సంబంధిత వ్యాధులకు గురవుతున్నవారే ఎక్కువగా ఉన్నారు. అదే దేశంలో మొదటిస్థానంలో ఉన్న వ్యాధిగా నివేదిక తెలిపింది. ఆ తర్వాత పక్షవాతం రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో ఊపిరితిత్తుల వ్యాధి ఉంది. అలా 16వ స్థానంలో కిడ్నీ వ్యాధి ఉంది. కానీ 2040 నాటికి కిడ్నీ వ్యాధి నాలుగో స్థానానికి వచ్చే ప్రమాదముందని హెచ్చరించింది. గుండె, పక్షవాతం, ఊపిరితిత్తుల వ్యాధి తర్వాత కిడ్నీ వ్యాధి అత్యంత ప్రమాదకరంగా తయారయ్యే ప్రమాదముందని తెలిపింది.  

తెలంగాణలో తక్కువే 
హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, సిక్కిం, నాగాలాండ్, గోవా, కేరళ రాష్ట్రాల్లో బీపీ బారినపడిన వారు అధికంగా ఉన్నారు. ఆయా రాష్ట్రాల్లో 26% మందికిపైగా బీపీతో బాధపడుతున్నారు. ఉత్తరాఖండ్, అసోంలో 24 నుంచి 26% ఉన్నారు. తెలంగాణ, రాజస్తాన్, యూపీ, మిజోరం రాష్ట్రాల్లో బీపీ రోగులు తక్కువగా ఉన్నారు. ఈ రాష్ట్రాల్లో 18%లోపు మాత్రమే బీపీతో బాధపడుతున్నారు. అయితే అధిక కొవ్వుతో బాధపడేవారు తెలంగాణలో ఏకంగా 22 నుంచి 25.4 %మంది ఉన్నారు.  

కిడ్నీ రోగులకు వైద్యుల కొరత.. 
కిడ్నీ వ్యాధి విస్తరిస్తున్నా ఆ మేరకు రోగులకు చికిత్స చేసే నెఫ్రాలజిస్టులు (కిడ్నీ వైద్య నిపుణులు) మాత్రం ఆ స్థాయిలో లేరు. ప్రస్తుతం దేశంలో కోటి మందికి కిడ్నీ వ్యాధి ఉండగా, వారికి చికిత్స చేయాలంటే కనీసం 30 నుంచి 40 వేల మంది నెఫ్రాలజిస్టులు కావాలి. కానీ ఇప్పుడు 5 వేల మంది రోగులకు ఒక నెఫ్రాలజిస్టు మాత్రమే ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లోనైతే అసలు నెఫ్రాలజీ వైద్యులే లేరంటే మరీ దారుణం. తెలంగాణలో 200 మంది నెఫ్రాలజిస్టులు ఉన్నారని వైద్య వర్గాల అంచనా.  

ఫిజీషియన్ల పాత్ర కీలకం 
దేశంలో నెఫ్రాలజిస్టుల కొరత ఉన్నమాట నిజమే. కాబట్టి ఆ మేరకు కిడ్నీ వ్యాధిని గుర్తించడంలో, అవసరమైన మేరకు చికిత్స చేయడంలో ఫిజీషియన్లు కూడా కీలకంగా ఉండాలి. రోగుల్లో వస్తున్న మార్పులను గుర్తించాలి. కిడ్నీ వ్యాధి ఉన్నట్లు అనుమానం ఉంటే పరీక్షలు చేయించాలి. – డాక్టర్‌ తాడూరి గంగాధర్, నెఫ్రాలజిస్ట్, నిమ్స్‌
 
కుటుంబంలో ఎవరికైనా ఉంటే అనుమానించాలి 
షుగర్, బీపీ వంటివి ఉంటే కిడ్నీ పరీక్ష చేయించుకోవాలి. అలాగే కుటుంబంలో ఎవరికైనా ఉంటే తప్పనిసరిగా టెస్ట్‌ చేయించుకోవాలి. రక్త, మూత్ర పరీక్షలు చేయించుకోవాలి. అల్ట్రాసౌండ్‌ పరీక్ష కూడా అవసరం. ముందుగా కిడ్నీ వ్యాధిని గుర్తిస్తే త్వరగా నయం చేయడానికి వీలు కలుగుతుంది.–డాక్టర్‌ కార్తీక్, నెఫ్రాలజిస్ట్, నిమ్స్‌   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top