Andhra Pradesh: Drinking Water Diversion First Phase Trial Run Successful - Sakshi
Sakshi News home page

ఇక ఉద్దానం ‘సురక్షితం’

Jul 22 2023 5:02 AM | Updated on Jul 22 2023 6:37 PM

Drinking water diversion first phase trial run successful - Sakshi

సాక్షి, అమరావతి: నలభై ఏళ్లుగా కిడ్నీ వ్యాధుల భయాలు వెంటాడుతున్న ఉద్దానం ప్రాంత ప్రజ­లకు భరోసా కల్పిస్తూ అక్కడకు వంద కి.మీ.పైగా దూరంలోని హిర మండలం రిజర్వాయర్‌ నుంచి సురక్షిత జలాలు కదిలాయి. భూగర్భ పైపులైన్ల ద్వారా ఉద్దానానికి నీటి తరలింపుపై గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్‌) అధికారులు వారం రోజులుగా నిర్వహిస్తున్న తొలిదశ ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది.

దాదాపు 132 కి.మీ. మేర భూగర్భ పైపు లైన్‌ను నిర్మించగా మార్గమధ్యంలో మెలియాపుట్టి వద్ద నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటైంది. మొదటి దశలో 32 కి.మీ. పొడవున భూగర్భ పైపులైన్‌ ద్వారా నీటిని తరలించారు. రానున్న 15 రోజులలో నీటి శుద్ధి కేంద్రం నుంచి ఉద్దానం చివరి ప్రాంతం ఇచ్ఛాపురం వరకు వంద కిలోమీటర్ల పొడవున ప్రధాన భూగర్భ పైపు లైన్‌ ద్వారా నీటి తరలింపు ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నారు. 

ఏడాది పొడవునా ప్రతి ఇంటికీ..
దాదాపు 807 నివాసిత ప్రాంతాలకు కొళాయిల ద్వారా తాగునీటి సరఫరాకు ఉద్దానం ప్రాంతాన్ని పది క్లస్టర్లుగా వర్గీకరించారు. అక్కడ నివసిస్తున్న దాదాపు 8 లక్షల మంది ప్రజలకు ఏడాది పొడవునా ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీటి సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 

ట్రయల్‌ రన్‌కు ఐదు కోట్ల లీటర్లు..
ఉద్దానం తాగునీటి అవసరాల కోసం రోజూ 8.40 కోట్ల లీటర్ల చొప్పున హిర మండలం నుంచి తరలిస్తారు. ఇందుకోసం 1,300 హెచ్‌పీ సామర్థ్యంతో మూడు భారీ నీటి పంపింగ్‌ మోటార్లను  హీర మండలం రిజర్వాయర్‌ వద్ద ఏర్పాటు చేశారు. మొదటి దశ ట్రయల్‌ రన్‌ కోసం ఐదు కోట్ల లీటర్లను మెలియాపుట్టి నీటి శుద్ధి కేంద్రం వద్దకు తరలించినట్లు అధికారులు తెలిపారు. మూడు మోటార్ల పనితీరును కూడా పరీక్షించారు.

మాట ప్రకారం.. ఖర్చుకు వెనుకాడకుండా
శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాస అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని దాదాపు ఏడు మండలాల పరిధిలో ఉద్దానం ప్రాంతం విస్తరించి ఉంటుంది. స్థానికులను దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న కిడ్నీ వ్యాధుల సమస్యను పరిష్కరించేందుకు సీఎం జగన్‌ రూ.700 కోట్లతో ఉద్దానానికి సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని మంజూరు చేయడం తెలిసిందే.

ఏడాది పొడవునా నీరు అందుబాటులో ఉండటంతో ఖర్చుకు వెనుకాడకుండా హిర మండలం రిజర్వాయర్‌ నుంచి నీటి తరలింపు చేపట్టాలని నిర్ణయించారు. ఏడాది పొడవునా ఉద్దానం నీటి అవసరాలను తీర్చేందుకు ఒక టీఎంసీ కన్నా తక్కువ అవసరం కాగా హిర మండలం రిజర్వాయర్‌లో కనీస మట్టం స్ధాయిలోనూ 2.67 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుంది. ఈ పథకంలో భాగంగా రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వివిధ గ్రామాల్లో మొత్తం 571 ఓవర్‌ హెడ్‌ ట్యాంకులను  ప్రభుత్వం నూతనంగా నిర్మించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement