ఫ్రీ వైఫై.. జీవితాన్ని మలుపు తిప్పింది

Kerala Railway Coolie Cracked Civil Services Exams - Sakshi

తిరువనంతపురం: పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యే అభ్యర్థులు తమ చుట్టూ పుస్తకాలు వేసుకుని గంటల తరబడి కుస్తీ పట్టడం చూస్తుంటాం. కానీ, ఇక్కడ ఓ యువకుడు ఫ్రీ వైఫై సాయంతో తన తలరాతను మార్చుకున్నాడు. కేరళ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగాల రాత పరీక్షలో ఇంటర్వ్యూకు అర్హత సాధించిన ఓ రైల్వే కూలీ స్టోరీ ఇది. 

మున్నార్‌కు చెందిన శ్రీనాథ్‌ పదో తరగతి పాసయ్యాడు. కుటుంబ ఆర్థిక స్తోమత అంతగా లేకపోవటంతో చదువుకు స్వస్తి చెప్పి ఐదేళ్ల క్రితం ఎర్నాకుళం రైల్వే స్టేషన్‌లో కూలీగా పనిలో చేరాడు. ఓవైపు కుటుంబానికి సాయంగా ఉంటూనే.. మరోపక్క ప్రభుత్వ పరీక్షలకు ప్రిపేర్‌ అవ్వాలని భావించాడు. అయితే అందుకు అవసరమైన మెటీరియల్‌ కొనుక్కునేందుకు అతని దగ్గర డబ్బులేదు. అయినప్పటికీ ఎలాగోలా కష్టపడి రెండుసార్లు పరీక్షలు రాశాడు. అలాంటి సమయంలోనే రైల్వే స్టేషన్‌లో ప్రవేశపెట్టిన ఫ్రీ వైఫై అతని జీవితాన్ని మలుపు తిప్పింది. 

స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులను వైఫై వాడటాన్ని గమనించిన శ్రీనాథ్‌కు ఓ ఆలోచన తట్టింది. బంధువుల దగ్గర అప్పు చేసి ఓ స్మార్ట్‌ ఫోన్‌ కొనుకున్నాడు. దాని ద్వారానే పోటీ పరీక్షలకు కావాల్సిన మెటీరియల్‌ను సమకూర్చుకోవటం ప్రారంభించాడు. ఓవైపు లగేజీ మోస్తూనే.. మరోవైపు ఇయర్‌ ఫోన్స్‌ ద్వారా ఫోన్‌లో ఆడియో పాఠాలు విన్నాడు. తెలిసిన కొందరు లెక్చరర్ల సాయంతో ఫోన్‌ కాల్‌ ద్వారా పాఠాలు చెప్పించుకున్నాడు. రాత్రిపూట ఆ పాఠాలను రివిజన్‌ వేసుకుంటూ కష్టపడ్డాడు. చివరకు ఈ మధ్యే కేపీఎస్‌సీ, విలేజ్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలో అర్హత సాధించాడు. త్వరలోనే శ్రీనాథ్‌ ఇంటర్వ్యూకు హాజరుకాబోతున్నాడు. అందులో విజయం సాధిస్తే అతని కష్టాలు తీరినట్లే. ‘పరిస్థితులను మనకు అనుకూలంగా మల్చుకుంటే ఎతంటి కష్టానైనా అధిగమించొచ్చు’ అని శ్రీనాథ్‌ చెబుతున్నాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top