వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేరళ హై కోర్టు న్యాయమూర్తి

Kerala HC Judge Glorifies Brahmins - Sakshi

తిరువనంతపురం: కేరళ హై కోర్టు న్యాయమూర్తి ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొంటున్నారు.  అయితే ఇక్కడ ఆయన ఎవరిని కించపర్చలేదు.. కానీ ఓ సామాజిక వర్గం వారిని కీర్తించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేరళకు చెందిన వి.చింతాబరేష్‌ హై కోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు. రాజ్యాంగబద్దంగా ఒక ఉన్నత పదవిలో ఉన్న ఆయన.. ఏ సామాజిక వర్గానికి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. కానీ ఆ విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా.. బ్రాహ్మణుల గుణగణాలను కీర్తించడంలో మునిగిపోయాడు చింతాబరేష్‌.

వివరాలు.. కొద్ది రోజుల క్రితం చింతాబరేష్‌ తమిళ్‌ బ్రాహ్మణ్స్‌ గ్లోబల్‌ మీట్‌కు హాజరయ్యారు. సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ‘పూర్వజన్మ సుకృతం ఉంటేనే బ్రాహ్మణుడిగా పుడతారు. బ్రాహ్మణుడు ద్విజుడు.. అంటే రెండు జన్మలు కలవాడు. శుభ్రమైన అలవాట్లు, ఉన్నతమైన ఆలోచనలు, గొప్ప వ్యక్తిత్వం, శాఖహారి, కర్ణాటక సంగీతాన్ని ఇష్టపడే లక్షణాలన్ని ఒక్క బ్రాహ్మణుడిలో మాత్రమే ఉంటాయి. గత జన్మలో ఎన్నో మంచి పనులు చేస్తేనే ఈ బ్రాహ్మణ జన్మ లభిస్తుంది. ఇంత ఉన్నతులైన బ్రాహ్మణులకు సమాజంలో సముచిత స్థానం దక్కడం లేదు. వారు మేలుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కుల ఆధారిత రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బ్రాహ్మణులు ఆందోళన చేయాలని’ ఈ సందర్భంగా చింతాబరేష్‌ పిలుపునిచ్చారు.

దేశంలో ఉన్నతమైన పదవి దక్కించుకోవడానికి బ్రాహ్మణులకే ఎక్కువ అర్హతలు ఉన్నాయన్నారు చింతాబరేష్‌. బ్రాహ్మణ సమాజంలోకి ఇతరులను అనుమతించకూడదన్నారు. బ్రాహ్మణుడు స్వచ్ఛమైన లౌకికవాది.. ప్రజలను ప్రేమిస్తూ.. వారి శ్రేయస్సు కోసం ఉదారంగా విరాళాలు ఇచ్చేవాడు. అలాంటి వాడు అధికారంలో ఉండే జనాలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం న్యాయమూర్తి వ్యాఖ్యల పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top