బ్రాహ్మణుడి శాపంతో ఊరంతా ఖాళీ! | Talari Cheruvu Village People Variety Tradition | Sakshi
Sakshi News home page

బ్రాహ్మణుడి శాపంతో ఊరంతా ఖాళీ!

Feb 2 2026 12:22 PM | Updated on Feb 2 2026 12:41 PM

Talari Cheruvu Village People Variety Tradition

తాడిపత్రి రూరల్‌: మాఘపౌర్ణమి రోజున తాడిపత్రి మండలం తలారి చెరువు  గ్రామం ఖాళీ అవుతోంది. పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలోని ఈ గ్రామం ఆదివారం తెల్లవారుజాము నుంచి 24 గంటల పాటు పొయ్యి వెలగదు. అగ్గిరవ్వ కనిపించకపోవడంతో దీనిని అగ్గిపాడుగా పిలుస్తారు. గ్రామస్థులు సమీపంలోని హాజీవలి దర్గాకు బయలుదేరి వెళ్తారు. గ్రామంలో పశువులు, కోళ్లను తీసుకొని పిల్లాపాపలతో అక్కడే వంట చేసుకుంటారు. రాత్రి వరకూ ఉండి అర్ధరాత్రి తర్వాత గ్రామంలోకి వస్తారు. గ్రామం ఖాళీ చేసినా దొంగలు రాకుండా ఉండేందుకు చుట్టూ కాపలాగా ఉంటారు. ఉదయం య«థావిధిగా దినచర్య మొదలెడతారు.

ఎందుకు గ్రామం ఖాళీ అవుతుందంటే..
400 ఏళ్ల కిందట ఓ బ్రహ్మణుడు తన అనుచరులతో కలిసి గ్రామంపై దాడి చేసి ధాన్యం, బంగారం, విలువైన వస్తువులను దోపిడీ చేయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో గ్రామస్తులంతా బ్రహ్మణుడు, అతడి అనుచరులను హతమార్చారు. బ్రాహ్మణుడు మరణిస్తున్న సమయంలో బ్రహ్మ హత్యా పాతకం చుట్టుకుంటుందని, గ్రామంలో వర్షాలు పడక కరవు, కాటకాలు ఏర్పడుతాయని, పుట్టిన బిడ్డలు పురిటిలోనే చనిపోతారంటూ చెప్పి మరణించాడు. అప్పటినుంచి తలారిచెరువు గ్రామంలో వర్షాలు సక్రమంగా కురియకపోగా, పంటలు పండక గ్రామంలో కరువు ఏర్పడింది. 

గ్రామాభివృద్ధి కుంటుపడి చిన్నారులు చనిపోవడంతో అరిష్టం పట్టుకుందని కొందరు గ్రామస్తులు పరిహారం కోసం స్వామిని సంప్రదించారు. బ్రహ్మ హత్యా పాతకం నుంచి విముక్తి కావాలంటే మాఘపౌర్ణమి రోజున గ్రామాన్ని ఖాళీ చేసి హాజీవలి దర్గాలో బసచేయాలని సూచించారు. ఆయన చెప్పిన విధంగా కుటుంబాలు గ్రామాన్ని ఖాళీ చేశాయి. దీంతో శాపం తొలగి పూర్వ వైభవం సంతరించుకుంది. అప్పటి నుంచి మాఘ పౌర్ణమి రోజు గ్రామాన్ని ఖాళీచేయడం అచారంగా కొనసాగుతోంది.  

Advertisement
 
Advertisement
Advertisement