సాయానికి ‘సోషల్‌’ దారి

kerala floods social media postings on Flood victims - Sakshi

సహాయక చర్యలకు దన్నుగా నిలుస్తున్న వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌

వరద ధాటికి చెల్లాచెదురైన కేరళ వరద బాధితులకు సోషల్‌ మీడియా ఆపద్బాంధవిగా మారి సహాయ బృందాలకు దారి చూపిస్తోంది. వరద నీటిలో చిక్కుకొని సాయంకోరే వారిలో కొందరు సోషల్‌ మీడియానే ఆశ్రయిస్తున్నారు. కేరళ ఫ్లడ్స్‌ , కేరళ ఫ్లడ్స్‌ హ్యాష్‌ ట్యాగ్‌తో ఎక్కడెక్కడిదో సమాచారం క్షణాల్లో వైరల్‌గా మారుతోంది. బాధితులు సాయం చేయాలంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3.3 కోట్ల మంది వరద బాధితులు ఇప్పటివరకు సామాజిక మాధ్యమాల ద్వారా సాయాన్ని అర్థించారు.

విద్యుత్‌ లేక అంధకారంలో మగ్గిపోతున్న వారు, ఫోన్‌లైన్‌లు కలవక ఇబ్బంది పడుతున్నవారంతా గూగుల్‌ మ్యాప్‌ ద్వారా తమ లొకేషన్‌ షేర్‌ చేస్తున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్‌ గ్రూపుల్లో తాము ఉన్న పరిస్థితిని వీడియోలు తీసి  పోస్ట్‌చేస్తున్నారు. తీర ప్రాంతంలోని అలాపుజాలో ఉండే అజో వర్గీస్‌ అనే వ్యక్తి ‘నేను, మా ఇరుగు పొరుగువాళ్లు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాం. తాగడానికి గుక్కెడు నీళ్లు లేవు. తినడానికి తిండి లేదు. కమ్యూనికేషన్‌ తెగిపోయింది. మా మొబైల్‌ ఫోన్లు స్విచ్ఛాఫ్‌ అయ్యే పరిస్థితి వచ్చింది. దయచేసి సాయం చేయండి‘ అంటూ ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టు క్షణాల్లోనే వైరల్‌గా మారింది. లక్షల్లో షేర్స్‌ వచ్చాయి.  

షేర్‌ చేస్తే మార్గం తెలుస్తుంది..
గూగుల్‌ మ్యాప్‌ ద్వారా కూడా లొకేషన్‌ను షేర్‌ చేస్తూ ఉండటంతో సహాయ బృందాలకు అక్కడికి వెళ్లడం సులభమవుతోంది. కేరళలోనే సురక్షిత ప్రాంతాల్లో ఉన్నవారు కూడా తమ బంధువుల జాడ తెలుసుకోవడానికి సామాజిక మాధ్యమాల్ని ఆశ్రయిస్తున్నారు. ‘మేము రెండో అంతస్తులో ఉన్నాం. ఇప్పటికే మొదటి అంతస్తు వరదనీటిలో మునిగిపోయింది. క్షణ క్షణానికి నీటి మట్టం పెరిగిపోతోంది. వృద్ధులు, పిల్లలు ఉన్నారు. మమ్మల్ని కాపాడండి’ అంటూ రాణిపేటకు చెందిన కొందరు పెట్టిన పోస్టు క్షణాల్లో వైరల్‌గా మారింది. 

వరద బాధితుల సాయం కోసం ప్రభుత్వం కొన్ని వాట్సాప్‌ నంబర్లని ప్రత్యేకంగా కేటాయించింది. ఆ నంబర్లకి లొకేషన్‌ షేర్‌ చేస్తే చాలు వెంటనే  సహాయ బృందాలను పంపిస్తోంది. ట్విట్టర్‌లోని కొంతమంది టెక్నీషియన్లు కలిసి గూగుల్‌ మ్యాప్‌ను అనుసంధానం చేస్తూ ఒక ప్లాట్‌ఫామ్‌ని రూపొందించారు. దీని సాయంతో సహాయక శిబిరాలు, సహాయ బృందాలు, వాలంటీర్లు, ఆహారం, మందులు, రవాణా వంటి వాటికి సంబంధించిన సమాచారం అంతా క్షణాల్లో తెలుస్తోంది. కేవలం సోషల్‌ మీడియా ద్వారా అందుకున్న సమాచారంతో లక్షా 50 వేల మందిని కాపాడినట్టు సమాచారం.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top