బానిసల్లా బతక్కండి: కమల్‌ హాసన్‌

Kamal Haasan Blames Govt Over Techie Death - Sakshi

చెన్నై : అధికార పార్టీకి చెందిన హోర్డింగ్‌ కారణంగా మృతి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ శుభశ్రీ ఉదంతం పట్ల నటుడు, మక్కల్‌ నీది మయ్యం అధినేత కమల్‌ హాసన్‌ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, రాజకీయ నాయకుల ప్రచారానికి ఇంకెంత మంది శుభశ్రీలు చనిపోవాలని ప్రశ్నించారు. శుక్రవారం కమల్‌ మీడియాతో మాట్లాడుతూ...’అసలు ఈ రాజకీయ నాయకులకు ఎక్కడ బ్యానర్లు పెట్టాలి. ఎక్కడ పెట్టాలో తెలియదా. కనీస ఇంగిత ఙ్ఞానం కూడా లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే శుభశ్రీ, రఘు వంటి ఎంతో మంది మృత్యువాత పడ్డారు. వాళ్ల తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసా. ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా వారి వేదనను నేను అర్థం చేసుకోగలను. కానీ ప్రభుత్వంలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఈ విషయాల గురించి వారిని ప్రశ్నించినా..నిజాలు మాట్లాడినా నాలుక కోస్తామని హెచ్చరిస్తారు. అటువంటి వాళ్లను అసలు పట్టించుకోవడమే మానేశాను. ప్రజా సమస్యల గురించి కచ్చితంగా ప్రశ్నించి తీరతా’ అని పేర్కొన్నారు.(చదవండి : నిషేధంతో బతుకు ప్రశ్నార్థకం)

అదే విధంగా ప్రజలు కూడా ఇవన్నీ భరిస్తూ మౌనంగా ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంటూ...‘ కలకాలం బానిసల్లా బతుకుదామని అనుకుంటే మీకంటే పిచ్చివాళ్లు ఎవరూ ఉండరు. పాలకులు మిమ్మల్ని బానిసల్లా చేసి ఆడుకుంటున్నారు. సాధారణ ప్రజల వల్ల ఏమతుందిలే అనే ధీమాతో ఉన్నారు. అయితే మీరంతా ఎంతో ధైర్యవంతులని, కొత్త నాయకత్వాన్ని ఎన్నుకుని వారికి బుద్ధి చెప్పి.. సరికొత్త నాయకులను ఎన్నుకుంటారని నాకు నమ్మకం ఉంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోండి అని కమల్‌ పిలుపునిచ్చారు. కాగా వారం రోజుల క్రితం పల్లావరం సమీపంలో బ్యానర్‌ మీద పడడం, వెనుక వచ్చిన లారీ మీదకి ఎక్కడంతో శుభశ్రీ అనే టెకీ మరణించిన విషయం విదితమే. దీంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో అధికారులు పరుగులతో ఎక్కడికక్కడ బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించే పనిలో పడ్డారు. అనుమతులు లేకుండా వాటిని ఏర్పాటు చేసిందుకు గాను 650 మందిపై కేసులు నమోదయ్యాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top